విజయవాడలో.. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు సహా ఐకాస నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వేదిక కల్యాణమండపం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఐకాస బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవటంతో... పాదయాత్రగా వెళ్లేందుకు అఖిలపక్ష నేతలు, ఐకాస ప్రతినిధుల ప్రయత్నించగా... పోలీసులు వారి అడ్డుకున్నారు. పోలీసులతో వివిధ పార్టీల నేతలు, ఐకాస ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా బెంజ్ సర్కిల్ రోడ్డుపై... చంద్రబాబు బైఠాయించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు పోరాటం ఆగదన్నారు.
'మమ్మల్ని ఎందుకు ఆపారు?.. ఎందుకీ దౌర్జన్యం. ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మేం చట్టప్రకారమే నడుచుకుంటున్నాం. ఏ చట్టం ప్రకారం మమ్మల్ని అడ్డుకుంటున్నారు. పోలీసులే అమరావతి ఐకాస బస్సు యాత్రకు అనుమతి ఇచ్చారు. బస్సు మార్గానికి మాత్రం అనుమతి లేదని తిరస్కరించారు. బస్సు యాత్రను కావాలనే అడ్డుకుంటున్నారు. అణచివేతతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు. గాంధేయ మార్గంలో నిరసన తెలపడం తప్పు కాదు' అని చంద్రబాబు అన్నారు. అమరావతి ఐకాస బస్సు యాత్రను అనుమతించాలని డిమాండ్ చేశారు.
బస్సు యాత్రకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం చంద్రబాబు, లోకేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును వాహనంలో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా... కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఐకాస కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.
పోలీసులు అదుపులో తెదేపా నేతలు
లోకేశ్, ఉమ, అచ్చెన్నాయుడు, రామానాయుడు, రాజేంద్రప్రసాద్, అశోక్‌బాబు, ఐకాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఐకాస నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాళం మాయం
చంద్రబాబును తరలించే వాహనం తాళం మాయం అయ్యింది. తాళం లేక వాహనం నిలిపోయింది. డుప్లికేట్ తాళంతో వాహనాన్ని స్టార్ట్ చేసి... చంద్రబాబును తరలించారు.
జాతీయరహదారిపై ట్రాఫిక్
చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో... జాతీయ రహదారిపైకి ఆందోళనకారులు భారీగా చేరుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి.
చంద్రబాబు నివాసం వైపు వాహనాలు
పోలీసులు చంద్రబాబును ఆయన నివాసానికి తరలించారు. చంద్రబాబు, ఐకాస నేతలను ఆయన నివాసం వద్ద దింపారు. చంద్రబాబు నివాసానికి తెదేపా శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
ఇదీ చదవండి :