ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

high court on elections
high court on elections

By

Published : Dec 3, 2020, 12:49 PM IST

Updated : Dec 4, 2020, 7:04 AM IST

12:45 December 03

మధ్యంతర ఉత్తర్వులివ్వలేం: హైకోర్టు

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) జారీచేసిన ప్రొసీడింగ్స్‌పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే జారీచేసిన ఆదేశాల్ని పరిశీలించేందుకు వాటి ప్రతుల్ని తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ (రాష్ట్ర ప్రభుత్వం)కు సూచిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ఎస్‌ఈసీ నవంబర్‌ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు ఎస్‌ఈసీకి సూచించింది. అయినా ఎస్‌ఈసీ ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా తన నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షలు దాటాయి. 7 వేల మంది చనిపోయారు. బీహార్‌, రాజస్థాన్‌లలో జరిగిన ఎన్నికలతో ఏపీని పోల్చలేం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కరోనా భయంతో పోలింగ్‌ శాతం తగ్గింది. ఎన్నికల సంఘం అక్టోబర్‌ 28న రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి సీఎస్‌ హాజరై అధికార యంత్రాంగమంతా కరోనా నియంత్రణ చర్యల్లో నిమగ్నమైనందున ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పారు’ అని తెలిపారు.

ప్రక్రియ ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించింది: ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది

ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ స్పందిస్తూ హైకోర్టులో దాఖలైన రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించిందని గుర్తు చేశారు. ‘అధికరణ 243కె ప్రకారం ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ స్వత్రంతంగా వ్యవహరించాలి. ఇందుకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంద’ంటూ పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయడానికి వారం రోజుల గడువు కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను వాయిదా వేయబోయారు. జీపీ స్పందిస్తూ ఈ వారం రోజులు ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌పై యథాతథ స్థితి (స్టేటస్‌కో) ఉత్తర్వులివ్వాలని కోరారు. 

హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఉండటం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించామని ఎస్‌ఈసీ చెబుతున్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌కు తదుపరి చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులివ్వాలని జీపీ మరోసారి కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు తుది ఉత్తర్వులకు ఎస్‌ఈసీ చర్యలు లోబడి ఉండేలా ఆదేశిస్తామన్నారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయం పిటిషనర్‌ న్యాయపరమైన హక్కులపై ప్రభావం చూపదనే విషయాన్ని నమోదు చేయాలని కోరారు. ఆ విషయాన్ని న్యాయమూర్తి నమోదు చేశారు. జీపీ స్పందిస్తూ.. ‘మా ప్రజల జీవన హక్కులపై ప్రభావం చూపుతుంది. ఇది మా న్యాయపరమైన హక్కుల ఉల్లంఘనే’ అని అన్నారు. దీనికి ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు.

ఇదీ చదవండి:

పేర్నిపై దాడి ప్రభావం.. కొడాలి ఇంట్లో భద్రత కట్టుదిట్టం

Last Updated : Dec 4, 2020, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details