సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల నిర్ణయాలు చెల్లబోవని హైకోర్టులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు తమ వాదన విన్పించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వరుసగా ఐదో రోజు రాజధాని అమరావతిపై విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, జంధ్యాల రవిశంకర్ పిటిషనర్ల తరపున తమ వాదనలు వినిపించారు. అమరావతికి భూములిచ్చిన రైతులను సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. భూములిచ్చిన రైతులకు రాజధాని అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇస్తామని చెప్పి చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఇదే తరహా ఒప్పందం ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగి ఉల్లంఘనకు గురైతే దాన్ని ‘మోసం’ అంటారని వివరించారు. అమరావతి కోసం రైతులు ఇచ్చిన వేల ఎకరాలకు తానే యజమాని అన్నట్లు ప్రభుత్వ వ్యవహరిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం చేయం.. భూములను మాత్రం తామే ఉంచుకుంటామంటే ఎలా అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. జీవనాధారం వదులుకొని పేద రైతులు ఇచ్చిన భూములను తీసుకొని.. తమకు నచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు. అనుచిత లబ్ధి పొందడం కోసం పాలన వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చి శాసనాధికారాన్ని దుర్వినియోగం చేసిందని తెలిపారు. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను తీసుకొచ్చే క్రమంలో ప్రతి దశలోనూ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని వాదించారు. ప్రభుత్వ వ్యవహార శైలిని ‘రాజ్యాంగం పట్ల వంచన’గా పేర్కొన్నారు.
శుక్రవారం జరిగిన విచారణలో అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు పానకాలరెడ్డి, మరికొందరి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధాని వ్యాజ్యాలపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ..‘రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన స్థలాలను ‘నవరత్నాలు’ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం చూస్తోంది. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చకపోవడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలంటే.. పూర్వస్థితిలో భూముల్ని తిరిగి ఇవ్వాలి, పరిహారం చెల్లించాలి. ప్రజల హక్కులకు విఘాతం కలిగే రీతిలో ప్రభుత్వాలు శాసనాలు చేసినప్పుడు వాటిపై సమీక్షాధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సీఆర్‌డీఏ చట్టం రైతులకు కల్పించిన రక్షణను ఏఎంఆర్‌డీఏ చట్టంతో తొలగించారు. దీంతో రైతుల హక్కులకు భంగం కలుగుతోంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను కొట్టేయండి’ అని కోరారు.