High court: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష...మరో ఇద్దరికి జరిమానా - ap high court sensational verdicts
13:25 September 02
ఐదుగురు ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం..
భూమికి పరిహారం చెల్లింపు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులుగా పేర్కొంటూ ముగ్గురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష, జరిమానా విధించింది. మరో ఇద్దరికి జరిమానాతో సరిపెట్టింది. పిటిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఖర్చులు చెల్లించాలని, ఆ సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అధికారుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాలు నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ తీర్పు ఇచ్చారు.
* విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల సాధారణ జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా. జరిమానా చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల జైలుశిక్ష.
* ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా. సొమ్ము చెల్లిచకపోతే 7రోజుల జైలుశిక్ష.
* నెల్లూరు జిల్లా పూర్వ కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా. అది చెల్లించకపోతే మూడు రోజుల జైలు శిక్ష.
* మరో పూర్వ కలెక్టర్ ఏవీ శేషగిరిబాబుకు రూ.2వేల జరిమానా. చెల్లించకపోతే ఏడు రోజుల జైలుశిక్ష.
* నెల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌కు రూ.2 వేల జరిమానా, చెల్లించని పక్షంలో ఏడు రోజుల జైలుశిక్ష.
నేపథ్యమిదే..: నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ కోసం భూమిని కేటాయించాలని ఆ సంస్థ అధికారులు కోరారు. పది ఎకరాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంట (సరస్వతీనగర్)కు చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడు ఎకరాల్ని తీసుకుని, ఆ సంస్థకు అప్పగించారు. దానికి పరిహారం చెల్లించకపోవడంపై సావిత్రమ్మ హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని 2017 ఫిబ్రవరి 10న హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయినా ఇవ్వకపోవడంతో ఆమె 2018లో అధికారులపై కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలుచేశారు. హైకోర్టు విచారణకు హాజరైన అధికారులు పరిహారం సొమ్మును ఈ ఏడాది మార్చి 30న సావిత్రమ్మకు చెల్లించామని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలు అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, అందుకు బాధ్యులుగా పేర్కొంటూ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధించారు.