రాజధాని ప్రాంత దళిత రైతులు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఎస్సీ ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద పిటిషనర్లపై నమోదు చేసిన కేసులను రద్దు చేసింది. ఐపీసీ 506 (నేరపూర్వక బెదిరింపు) సెక్షన్ రద్దుకు నిరాకరించింది. ఈ ఒక్క సెక్షన్‌తో దర్యాప్తు చేసేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. మూడు రాజధానులకు అనుకూలంగా గత ఏడాది అక్టోబరు 23న తాళ్లాయపాలెంలో జరిగే కార్యక్రమానికి వెళుతున్న వారిని కృష్ణాయపాలెం వద్ద అడ్డుకునేందుకు కొందరు యత్నించారు. ఇరువర్గాలకు సర్ది చెప్పడానికి వెళ్లిన తనను దూషించి, ట్రాక్టరుతో తొక్కిస్తామని 11 మంది బెదిరించారంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఈపూరి రవిబాబు అనే వ్యక్తి మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులను రద్దు చేయాలంటూ ఈపూరి జయకృష్ణ, ఈపూరి చిన్న ఇస్మాయిల్, సీహెచ్ రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు.
ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసుల రద్దు
కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు
11:44 January 20
కృష్ణాయపాలెం రైతులపై... అట్రాసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు
Last Updated : Jan 21, 2021, 6:55 AM IST