ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2019, 5:29 AM IST

Updated : Nov 23, 2019, 6:11 AM IST

ETV Bharat / city

'బిల్డ్​ ఏపీ మిషన్'​ మార్గదర్శకాలు విడుదల

‍‌'బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్' మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మిషన్ కింద ఖాళీ భూములను విక్రయించి... నవరత్నాల అమలుకు నిధులు సమీకరించనుంది. భూముల అమ్మకానికి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో సర్కారు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

'బిల్డ్​ ఏపీ మిషన్'​ మార్గదర్శకాలు విడుదల

నవరత్నాల పథకాలకు నిధుల సేకరణ కోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అభివృద్ధి చేసి విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు మరో అడుగు ముందుకేసింది. బిల్డ్‌ ఏపీ మిషన్‌కు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ, అమలు కమిటీలకు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్‌తో పాటు సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు, నేషనల్ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ ఛైర్మన్‌గా... ప్రభుత్వం నామినేట్ చేసేవారు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ భూముల గుర్తింపు, విక్రయం, ఎస్క్రో ఖాతాల ద్వారా నిధుల నిర్వహణ, గుర్తించిన భూముల్లో మౌలిక సదుపాయల కల్పనను జిల్లాస్థాయి అమలు కమిటీ పూర్తి చేయనుంది.

ఈ బిడ్డింగ్​ ద్వారా భూముల వేలం

గుర్తించిన భూములను ముందుగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి నివేదిస్తారు. ఆ తర్వాత మంత్రివర్గం ముందు ఉంచుతారు. ఉన్నత స్థాయి కమిటీ అమోదం తర్వాత ఎన్​బీసీసీ విక్రయానికి ఉంచుతుంది. 'ఈ బిడ్డింగ్' ప్రక్రియ ద్వారా భూములను వేలం వేసి... గరిష్ఠ విలువ పొందాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రక్రియలో భాగంగా సదరు భూవిక్రయ పత్రంలో సంతకం చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాస్థాయి అమలు కమిటీతో పాటు ఎన్​బీసీసీ సంయుక్తంగా ఎస్క్రో ఖాతాను తెరిచి భూముల అమ్మకాల నిధులను నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎస్క్రో ఖాతా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల మళ్లింపు జరుగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

డిసెంబరు 16 నుంచి అమల్లోకి మారిటైమ్ బోర్డు చట్టం

Last Updated : Nov 23, 2019, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details