అవినీతి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో... ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, అవినీతి నిరోధక శాఖ చీఫ్ విశ్వజిత్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది.
అవినీతి నిర్మూలనకు అహ్మదాబాద్ ఐఐఎంతో ఒప్పందం..! - CM jagan on corruption news
అవినీతి నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించడానికి... దేశంలోనే ప్రముఖ మేనేజ్మెంట్ సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమగ్ర అధ్యయనం....!
ప్రభుత్వ తాజా ఒప్పందం ప్రకారం... పట్టణ, పురపాలక ప్రణాళిక విభాగాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి చర్యలను ఐఐఎం సమగ్ర అధ్యయనం చేయనుంది. అవినీతికి ఆస్కారమిస్తున్న అంశాలను పరిశీలించి... నిర్మూలన చర్యలను సూచిస్తుంది. ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులను సూచించడమే కాకుండా... అవినితి నిర్మూలన వ్యూహాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను అవినీతికి దూరంగా నిర్వహించాలన్న ప్రభుత్వ సూచనలను ఐఐఎం పరిశీలిస్తుంది.
ఇదీ చదవండి : తెలుగు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: లోకేశ్