వైకాపా ఎమ్మెల్యేల ప్రకటనతో మందడంలో ఉద్రిక్తత
18:31 December 26
జీఎన్ రావు కమిటీ సిఫారసులు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని... దీనిని సమర్థిస్తున్నామని గురువారం కృష్ణా, గుంటూరు వైకాపా నేతలు చెప్పారు. ఈ ప్రకటనతో అమరావతిలోని మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారిపైనే రైతులు ధర్నాను కొనసాగించారు. 2 టెంట్ల కింద పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు బైఠాయించారు. 'రక్తాన్నైనా చిందిస్తాం... అమరావతిని సాధిస్తాం, మాట ఇచ్చారు.. మడమ తిప్పారు' అంటూ నినాదాలు చేశారు. రైతుల ధర్నాకు ముస్లిం సంఘాలు మద్దతు తెలిపాయి. టెంట్‌లోనే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. రోడ్డుపై వేసిన టెంట్‌లోనే గ్రామస్థులు భోజనాలు చేశారు. టెంట్‌లోనే పడుకునేందుకు గ్రామస్థులు సిద్ధమవ్వగా... రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు వచ్చి బలవంతంగా టెంట్ తీయించారు.మరోవైపు గుంటూరు జిల్లా వైకాపా నేతల వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాలోని వివిధ గ్రామాల్లో రోడ్లపై టైర్లు తగులపెట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం:మూడు రాజధానులు సమ్మతమే: గుంటూరు, కృష్ణా వైకాపా ఎమ్మెల్యేలు