కృష్ణా, గుంటూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. రాజధానిపై కీలక ప్రకటన వచ్చే తరుణంలో ఆ పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ఉత్కంఠ రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు.. మూడు రాజధానులు ఏర్పాటు తమకు సమ్మతమేనని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగిలా ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం ప్రకటిస్తుందన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే పార్థసారథి
రాజధాని అభివృద్ధికి రూ.లక్షా 10 వేల కోట్లు అవసరమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారన్నారు. రాజధానిపై పెట్టుబడి తగ్గించి.. రైతులకు ఎక్కువ సాయం చేయాలని భావిస్తున్నారన్నారు. విద్య, మౌలిక వసతులపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో సీఎం ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. అమరావతిలో అన్నివర్గాలను సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఏ ప్రాజెక్టులు తీసుకొస్తే అమరావతి రైతులకు మేలు జరుగుతుందో సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు.
జీఎన్ రావు నివేదికను సమర్థిస్తున్నాం : ఎమ్మెల్యే అంబటి రాంబాబు
రాజధానికి కేంద్రం రూ.లక్షా 9 వేల కోట్లు ఇస్తుందని అనుకోవట్లేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
జీఎన్ రావు నివేదికను కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా నేతలు సమర్థిస్తున్నామని చెప్పారు. జీఎన్‌రావు కమిటీ ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తామన్నారు. నివేదికపై తదుపరి విషయాలు చర్చించామన్నారు. రాజధాని నిర్మాణం అంటే కొత్త పట్టణాలు కాదన్నారు. తాత్కాలిక రాజధానికి రూ.5 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టారని రాంబాబు అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని కోసం రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. తెచ్చిన అప్పులకు ఇప్పటికే రూ.700 కోట్లు వడ్డీలు కడుతున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలమో సీఎం చర్చించారని అంబటి రాంబాబు చెప్పారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న అంబటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. తాత్కాలిక రాజధానిపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారని, తాత్కాలిక రాజధానిని ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని కోసం నగరాన్ని నిర్మించడం కాదని, నగరంలోనే రాజధాని పెట్టాలని భావిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి తెలిపారు. రాజధాని అంటే సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మించడం మాత్రమే కాదన్నారు. అమరావతి భూములను అభివృద్ధి చేయాలని సమావేశంలో చర్చించామన్నారు. అమరావతి భూములను ఎలా ఉపయోగించుకోవాలో అనేదానిపై త్వరలో ప్రభుత్వం ఓ నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.
అమరావతి ఓ నగరం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్లో నగరం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుందని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. దీనికోసం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిన అప్పులు రాష్ట్రానికి పెనుభారంగా మారాయన్న ఆయన.. ఏ కులం మీదో, ప్రాంతం మీదో ప్రభుత్వానికి కక్ష లేదన్నారు. అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా.. రైతులకు అండగా ఉంటామన్నారు. రూ.లక్ష కోట్లు అప్పుచేసి ఒకేచోట ఖర్చు చేయాలా అనేదాన్ని సీఎంతో చర్చించామని ఆయన తెలిపారు. రైతులతో చర్చలు జరిపి, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామన్నారు.
ఇదీ చదవండి :