తెలుగుదేశం చేపట్టిన సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకు లేని దిశ చట్టంపై కార్యక్రమాన్ని చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సాధన దీక్షలో అచ్చెన్న పాల్గొన్నారు. కొవిడ్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కనీసం చలనం లేనట్టుగా కొవిడ్ బాధితుల న్యాయమైన డిమాండ్ల పట్ల సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తును తక్కువ అంచనా వేయడం వల్లే రాష్ట్రంలో ఇంత నష్టం జరిగిందని ఆవేదన చెందారు. చంద్రన్న బీమా ఎత్తివేయకుండా ఉండుంటే చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున అంది ఉండేదని గుర్తుచేశారు.
కొవిడ్ బాధితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే పోరాటం చేస్తున్నామని అచ్చెన్న అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు దీక్షలు చేస్తున్నాయని.. విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడాలని అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
"ఏడాదిగా ప్రభుత్వానికి ఎన్నో సలహాలు, సూచనలు చేశాం. మా సలహాలు, సూచనలు సీఎం జగన్ పట్టించుకోవట్లేదు. కొవిడ్ బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నాం. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మౌలిక సదుపాయాలు లేవు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన సీఎంకు లేదు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సీఎం విఫలమయ్యారు." -అచ్చెన్నాయుడు