తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ (46)కు భర్త, కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో తన వెంట తెచ్చుకున్న కట్నకానుకల విలువ భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారు రూ.15 కోట్ల వరకూ విలువ చేస్తాయి. ఈ పరిస్థితుల్లోనే.. భర్త మరో మహిళను వివాహం చేసుకుని, ఆమెను వదిలించుకునేందుకు యత్నించాడు. ముందుగా ఆస్తిని తన పేరిట బదిలీ చేయాలని భార్యను వేధించసాగాడు. దీన్ని అడ్డుకోవాల్సి సుపుత్రుడు.. ఆస్తిలో తనకూ కొంత భాగం వస్తుందని తండ్రికి వంతపాడాడు. కానీ.. ఆమె అందుకు అంగీకరించలేదు.
దీంతో.. భర్త, కొడుకు ఇద్దరూ కలిసి నిత్యం ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆస్తి తమ పేరిట రాయాల్సిందేనని పంచాయితీ పెట్టేవారు. ఈ వేధన భరించలేక.. కొన్నాళ్లకు ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె సంతకం చేస్తే తప్ప వాళ్లకు ఆస్తి దక్కదు.. కానీ సంతకం చేయట్లేదు. కాబట్టి.. ఆమెను చంపేయాలని అనుకున్నారు. కానీ.. హత్య కేసులో దొరికిపోతారని అనుకున్నారేమో.. భౌతికంగా ప్రాణాలతోనే ఉంచి.. రికార్డుల్లో మాత్రం చంపేయాలని ప్లాన్ వేశారు. అప్పుడు పిచ్చితల్లి బాధ తప్పుడుతుంది.. ఆస్తి చేతిలో పడుతుందని భావించారు.
ఈ ప్లాన్ అమలు చేసేందుకు 2017లో ఓ రోజు ఇద్దరూ ఆమెను వెంటబెట్టుకొని రైల్వే స్టేషన్ కు వెళ్లారు. మతి స్థిమితం లేని ఆమెను.. కనిపించిన ఏదో రైలు ఎక్కించి అక్కడి నుంచి జారుకున్నారు. ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వెళ్లిపోయారు. ఆమె గురించి అడిగిన వారికి.. మతి స్థిమితం లేదు కదా.. ఎటో వెళ్లిపోయిందని చెప్పడం మొదలు పెట్టారు. కొంతకాలానికి బంధువులు సైతం ఈ విషయాన్ని మర్చిపోయారు. సదరు మహిళ తల్లి వృద్ధురాలు కావడం, స్థానికంగా లేకపోవడంతో.. ఆమె కూడా ఏమీ చేయలకపోయింది. ఆ తర్వాత భర్త మరో మహిళతో హాయిగా విదేశాలకు వెళ్లిపోయాడు. కొడుకు బెంగళూరులో ఉద్యోగం పేరుతో వెళ్లిపోయాడు. ఆస్తులు వాటాలు వేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
తల్లి ఎక్కడ..ఐదేళ్ల క్రితం ఏ రైలెక్కి.. ఎక్కడకు వెళ్లిందో తెలియదుగానీ.. కొద్దిరోజుల తర్వాత చెన్నైకి చేరుకుంది. అక్కడి రైల్వే పోలీసులు ఈమె పరిస్థితి గమనించి సాయం చేశారు. ఇందులో భాగంగా.. స్వచ్ఛంద సంస్థ అన్బగం రిహాబిలిటేషన్ సెంటర్ కు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ సంస్థే ఈమె బాగోగులు చూస్తోంది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆశ్రయం కల్పించి, వైద్యం చేయించి ఆమె మానసి స్థితిని బాగుచేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆమె గతాన్ని గుర్తు తెచ్చుకోలేకపోయింది.
అలా వెలుగు చూసింది..ఇటీవలస్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్ కార్డు తీయాలని చెన్నైలోని ఓ కేంద్రానికి తీసుకెళ్లారు. వేలిముద్రలు తీసుకుంటుండగా.. అప్పటికే ఆమెకు ఆధార్ కార్డు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ గుర్తించింది. వెంటనే కార్డు తీసుకుని వివరాలు చూడగా.. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. కార్డులోని చిరునామాను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు అందుబాటులోకి రాలేదు. దీంతో.. వారు హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఎట్టకేలకు కుమారుడి అడ్రస్ పట్టుకున్నారు. చైన్నై స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పంపించిన ఆ మహిళ ఫొటోతో.. కుమారుడి వద్దకు వెళ్లారు. ఆమె ఫొటో చూపించి.. ఈమె మీ తల్లి అవునా.. కాదా.. అని ప్రశ్నించారు. తొలుత కాదు అని చెప్పాడు. ఆ తరువాత తమ తల్లి ఎప్పుడో చనిపోయింది అని చెప్పాడు. మరణ ధ్రువపత్రం కూడా తమ వద్ద ఉందని చెప్పాడు. దీంతో.. పోలీసులు లోతుగా విచారిస్తే వారి కుట్ర బయటపడింది.
మరణించిందని..ఆమెను వదిలించుకున్న తండ్రీ కొడుకు.. వరంగల్ నగర పాలక సంస్థకు వెళ్లి, ఆమె చనిపోయిందని మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఆ వెంటనే ఆమె పేరిట ఉన్న సుమారు రూ.15 కోట్ల ఆస్తులను తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. ఆస్తి కోసం తల్లి చనిపోయినట్టు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరణ ధ్రువపత్రం ఎలా జారీ అయ్యిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళ చెన్నైలోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్దనే ఉంది. త్వరలోనే ఆమెను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు.. తెలంగాణ గవర్నర్, సీఎంతోపాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ కు లేఖలు పంపించారు.
ఇవీ చూడండి: