రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మహమ్మారి బారి నుంచి మరో 3,043 మంది బాధితులు కోలుకున్నారన్న ఆయన.. పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందన్నారు. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
గ్రామాల్లోనూ పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు కావాలని.. దేశవ్యాప్తంగా గ్రామాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిందని డీహెచ్ పేర్కొన్నారు. గ్రామాల్లోనూ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు కరోనాపై అధికారులతో అవగాహన కల్పిస్తున్నామని.. కరోనా కేసులు తగ్గితే లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు లభించే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 55 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయన్న డీహెచ్.. ఆస్పత్రుల్లో 14 వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. 7,018 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశామని డీహెచ్ వెల్లడించారు. సర్వేలో 4,037 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామన్నారు. కొన్నిచోట్ల మూడో దశ ఇంటింటి సర్వే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న 3.5లక్షల మందిని ఫీవర్ సర్వేలో గుర్తించామన్నారు. 114 ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయన్న డీహెచ్.. వాటిపై విచారించి చర్యలు చేపడతామన్నారు.