ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

'ఇడ్లీ'మ్యాన్​.. సృష్టించాడు 2 వేల రుచులు!

ఈరోజూ ఇడ్లీయేనా అయితే నాకు టిఫిన్‌ వద్దులే’... ఇడ్లీ అనగానే చిన్న పిల్లలే కాదు, కాలేజీ పిల్లలూ ఆఖరికి పెద్దలు కూడా చాలామంది ఇలాగే మొహం చాటేస్తారు. కానీ చెన్నైలోని ఆ సంస్థకు మాత్రం ప్రత్యేకంగా ఇడ్లీ కోసమే ఆర్డర్లు వెల్లువెత్తుతాయి. అది... ఇడ్లీల్లో రెండువేల రకాలు కనిపెట్టిన సంస్థ మరి.

Two thousand varieties of Idli are making in Chennai

By

Published : Jul 14, 2019, 8:30 PM IST

Updated : Jul 14, 2019, 8:37 PM IST

కొంతమంది వ్యక్తుల పరిచయం, కొన్ని ప్రయాణాలూ జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతుంటాయి. కోయంబత్తూర్‌కి చెందిన ఇనియవాన్‌ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసిన అతడు బతుకుతెరువు కోసం హోటళ్లలో కప్పులు కడిగాడు, టేబుళ్లు తుడిచాడు. ఆ తర్వాత ఆటో నడుపుకోవడం మొదలుపెట్టాడు. చంద్రమ్మ అనే ఒకావిడ- ఇంటి దగ్గర ఇడ్లీలు వండి, వాటిని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అమ్ముకోవడానికి రోజూ ఇనియవాన్‌ ఆటో ఎక్కేది. అక్కడే...ఇనియవాన్​ జీవితం మలుపుతిరిగింది.

టైంపాస్​ ప్రయాణమే! కానీ!

ఆ ప్రయాణంలో పిచ్చాపాటీగా మాట్లాడేటపుడు చంద్రమ్మ ఇడ్లీల తయారీ గురించీ దానికోసం చేయవలసిన పనులూ వినియోగదారుల అభిరుచుల గురించీ ఎన్నో విషయాలు చెప్పేది. అలా వినీ వినీ తను కూడా ఓ ఇడ్లీ హోటల్‌ పెడితే బాగుంటుంది కదా... అన్న ఆలోచన వచ్చింది ఇనియవాన్‌కి. అంతే, 22 ఏళ్ల కిందట ఆటో డ్రైవర్‌ వృత్తికి టాటా చెప్పేసి కోయంబత్తూర్‌ నుంచి చెన్నై వచ్చి ‘మల్లిపూ ఇడ్లీ’ పేరుతో ఓ పాత పాకలో హోటల్‌ని ప్రారంభించాడు. ప్రతి ఆరంభం శుభారంభం అవ్వడం సాధ్యం కాదన్నట్లూ ఇనియవాన్‌ హోటల్‌ ప్రారంభించిన వెంటనే భారీ వర్షాలు కురవడం మొదలయ్యాయి. పాకలోంచి నీరు కారడంతో సరకులూ ఇడ్లీ పిండీ అన్నీ తడిసిపోయాయి. అయినా నిరుత్సాహపడలేదు. వర్షాలు తగ్గాక మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు.

ఇడ్లీమ్యాన్‌...

హోటల్‌ రంగంలో రాణించాలంటే ఆహారం రుచికరంగా ఉండడంతో పాటు, తనదగ్గర దొరికే రుచులు మిగిలిన వారికంటే భిన్నంగా ఉండాలన్న విషయం కొద్దిరోజులకే ఇనియవాన్‌కి అర్థమైంది. అందుకే, ఇడ్లీని కొత్త రుచుల్లో తయారు చెయ్యడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకోసం లేత కొబ్బరి, చాకొలెట్‌, బాదం, నారింజ గుజ్జు, మొక్కజొన్న పిండి... లాంటి రకరకాల పదార్థాలను ఇడ్లీ పిండిలో కలిపేవాడు. ఆ కొత్త రుచులు వినియోగదారులకూ నచ్చాయి. వేరువేరు హోటళ్లకూ పెళ్లిళ్లకూ ఇతర ఫంక్షన్‌లకూ హోల్‌సేల్‌గా ఇడ్లీలను అమ్మడం మొదలుపెట్టాడు. గిరాకీ బాగా పెరిగింది. ఇక, ఇనియవాన్‌ వెనక్కు తిరిగి చూసుకోలేదు.

గిన్నిస్ రికార్డు సైతం!

అలా ఇప్పటివరకూ దాదాపు రెండు వేల కొత్తరకం ఇడ్లీలను సృష్టించాడు. అందులో 20కి పైగా రుచులకు పేటెంట్‌ కూడా ఉంది. అతడి పేరూ ‘ఇడ్లీ మ్యాన్‌’గా మారిపోయింది. ‘ఇడ్లీలు ఆరోగ్యానికి మంచివి. కానీ చాలామందికి వాటి రుచి అంతగా నచ్చదు. అలాంటి పిల్లలకూ పెద్దలకూ ఇడ్లీల్లో కొత్త రుచుల్ని పరిచయం చెయ్యడంతో పాటు ఇంకాస్త ఆరోగ్యకరమైన వెరైటీలనూ అందించాలనుకున్నా. మా పిల్లల విషయానికొస్తే వారికి పిజ్జా బర్గర్లంటే ఇష్టం. అందుకే, వారిని కొంతలో కొంతైనా అటునుంచి మళ్లించడానికి పిజ్జా ఇడ్లీ తయారుచేశా. రాగులూ జొన్నల్లాంటి రకరకాల చిరుధాన్యాలతోపాటు యాపిల్‌, నారింజ, బీట్‌రూట్‌, క్యారెట్‌, పుదీనా, మునగాకు... లాంటి పండ్లూ కూరగాయలతో తయారు చేసిన ఇడ్లీలు కూడా మా దగ్గర దొరుకుతాయి. కాస్త స్పైసీగా ఉండాలనుకునేవారు ఉప్మా ఇడ్లీ, సేమ్యా ఇడ్లీ, మసాలా ఇడ్లీలనూ తినొచ్చు’ అంటాడు ఇనియవాన్‌.

బుల్లి బుల్లి గిన్నెల ఆకారంలోనూ, గణపతి, కలాం, మిక్కీమౌస్‌, కుంగ్‌ఫూ పాండా... ఇలా రకరకాల రూపాల్లో కూడా ఇడ్లీలను తయారు చెయ్యడం అతడి ప్రత్యేకత. అతడు వండిన 125కిలోల ఇడ్లీ గిన్నిస్‌ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ప్రస్తుతం మల్లిపూ ఇడ్లీ సంస్థ 30 రుచుల్లో హోల్‌సేల్‌గా ఇడ్లీలను అమ్ముతోంది. ఇక, తమిళనాడు కుకింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఇనియవాన్‌ పుట్టినరోజు (మార్చి30)నే ప్రపంచ ఇడ్లీ డేగా మార్చేసిందంటే ఆశ్చర్యమేముంది చెప్పండి!

Last Updated : Jul 14, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details