13 జిల్లాలు ఉన్న నవ్యాంధ్రలో... 9 జిల్లాల్లో ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా, జనసేన మహిళా అభ్యర్థులని బరిలో నిలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా 18, వైకాపా 15, జనసేన 17 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాయి. మూడు పార్టీలు మహిళా అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో 9 జిల్లాలకే పరిమితమయ్యాయి. 4 జిల్లాల్లో మహిళలకు టికెట్ కేటాయించలేదు.
19 నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏడుగురు మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం ముగ్గురికి, జనసేన, వైకాపా ఇద్దరు చొప్పున మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాయి. కాకినాడ గ్రామీణం నుంచి పిల్లి అనంతలక్ష్మి, రాజమండ్రి నగరం నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవాని, రంపచోడవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. రంపచోడవరం నుంచి ఎం.ధనలక్ష్మి, పెద్దాపురం నుంచి వాణి వైకాపా బరిలో ఉన్నారు. జనసేన విషయానికొస్తే పి. గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, పిఠాపురం నుంచి మాకినీడి శేషు కుమారి పోటీ చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నుంచి తెదేపా తరఫున వంగలపూడి అనిత కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొవ్వూరు నుంచి వైకాపా తరఫున టి. వనిత పోటీ చేస్తున్నారు. జనసేన తరఫున దెందులూరు నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి, నిడదవోలు నుంచి అటికల రమ్యశ్రీ నించున్నారు. విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలుంటే తెదేపా నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఇద్దరు, వైకాపా నుంచి ఒక మహిళా అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎస్. కోట నుంచి కొల్లా లలిత కుమారి, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు తెదేపా తరపున పోటీ చేస్తుండగా... కురుపామ్ నుంచి వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, జనసేన తరఫున నెల్లిమర్ల నుంచి లోకం నాగ మాధవి, విజయనగరం నుంచి పాలవలస యశస్వి పోటీ చేస్తున్నారు.
విశాఖలో 15 నియోజకవర్గాలు ఉండగా..... వైకాపా ఇద్దరు మహిళా అభ్యర్థులకు చోటు కల్పించింది. తెదేపా, జనసేన ఒక్కో మహిళా అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. పాడేరు నుంచి భాగ్యలక్ష్మి, విశాఖ తూర్పు నుంచి ఏ. విజయనిర్మల సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు. తెదేపా తరఫున ఈశ్వరి, జనసేన తరపున విశాఖ ఉత్తరం నుంచి ఏ. పసుపులేటి ఉషారాణి పోటీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి వైకాపా, జనసేన ఒక్క మహిళా అభ్యర్థికి కూడా చోటు కల్పించలేదు. తెలుగుదేశం ముగ్గురికి అవకాశం ఇచ్చింది. పశ్చిమ నుంచి షబానా ఖాతూన్, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య బరిలో ఉన్నారు.
గుంటూరులో తెదేపా తరఫున మహిళా అభ్యర్థులు ఎవరూ బరిలో లేరు. తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరితలకు వైకాపా అవకాశం ఇచ్చింది. గుంటూరు నుంచి జనసేన నలుగురు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. చిలకలూరిపేట నుంచి మిరియాల రత్నకుమారి, మాచర్ల నుంచి రమాదేవి, పొన్నూరు నుంచి పార్వతి నాయుడు, పెదకూరపాడు నుంచి పుట్టి సామ్రాజ్యం పోటీ చేస్తున్నారు. ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి మూడు పార్టీలూ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు.