కాంగ్రెస్ ప్రియాంకాస్త్రం.. మారుతున్న రాజకీయం పార్టీకి మరింత బలం తెచ్చేందుకు ప్రియాంక గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రధాని అభ్యర్థిగానూ ప్రచారం మొదలైంది. మమత, మాయావతి పేర్లు ప్రధాని అభ్యర్థిత్వం కోసం వినిపిస్తున్నందుకు ప్రతిగా మహిళా నేతగా కాంగ్రెస్ తరఫున ప్రియాంకను రంగంలోకి దించారన్న వాదనలూ ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతానికే పార్టీలోకి తీసుకొచ్చారని కొందరు, లోక్‌సభ ఎన్నికల ప్రధాన ప్రచారకర్త అని మరికొందరు చెబుతున్నారు.
ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. తూర్పు ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు. ఈ బాధ్యత ఆషామాషీది కాదు. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. సంక్లిష్టమైన కుల, మత, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణలకు వేదికైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ప్రజలకు చేరువకావడం అంత సులువు కాదు. ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ నుంచే. భాజపా ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాధ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. వారిద్దరినీ ఎదుర్కోవడం ప్రియాంకకు అసలైన అగ్నిపరీక్ష.
ప్రతిపక్షాల కూటమిలోనూ ప్రియాంక కీలకంగా మారే అవకాశం తక్కువే. ఎందుకంటే ఎన్నికలకు సమయం అంతగా లేదు. ప్రచారానికి పరిమితయ్యే అవకాశమే ఎక్కువ. అది కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే. సోషల్ మీడియాలో శక్తిమంతమైన భాజపా సైన్యాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయంలో ప్రియాంక ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో వేచిచూడాలి.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక వస్తారన్న ప్రకటన చేసినప్పుడు ఉన్న హడావుడి... ఆమె నిజంగా రంగంలోకి దిగాక కనిపించలేదు. కాంగ్రెస్ సృష్టించదలచిన "బ్రాండ్ ప్రియాంక" తాలూకా ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించలేదు. అంతా సాదాసీదాగా సాగిపోయింది. ఇది వ్యూహాత్మకమా, వ్యూహ రచనలో లోపమా.... కాంగ్రెస్ పెద్దలకే ఎరుక.
కదం తొక్కుతున్న కూటమి... కలవరపెడుతున్న ఓటమి
అంతుచిక్కని భాజపా వ్యూహం..
మొన్నటి వరకు తమకు తిరుగు లేదని భావించిన భారతీయ జనతా పార్టీకి విపక్షాల ఐక్యత ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితం వరకు ఆ పార్టీ నేతల వెంట ఓటమి అనే మాట చాలా తక్కువగా వచ్చింది. ఇప్పడు మాత్రం ప్రతిపక్షాల కూటమి గెలిస్తే ప్రధాని ఎవరనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది.
సంక్షేమ బాట... ప్రచారం ముమ్మరం..
"సంస్కరణలకే పెద్దపీట వేస్తాం"... ఇదీ మొదటి నుంచి భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ స్వరం. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది కనిపించలేదు. ఓటమి భయంతోనే భాజపా సంక్షేమబాట పట్టిందని నేతలు విమర్శిస్తున్నారు. రైతుల సంక్షేమ నినాదంతో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడం వల్ల భాజపా రైతుల కోసం బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధిని తీసుకొచ్చింది. అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్ వరమిచ్చింది. సంక్షేమ బడ్జెట్ అని పేరు తెచ్చుకుంది.
రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది భాజపా. ప్రధాని మోదీ సహా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కీలక నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పాత మిత్రులను కలుపుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు.
ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని, అవినీతి కూటమి అనే వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భాజపా నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంకీర్ణ కూటమి వల్ల దేశాభివృద్ధి సాధ్యం కాదని చెబుతున్నారు. గత అనుభవాలను పదేపదే ఉదహరిస్తున్నారు.
కూటమికి కింగా, క్వీనా?
మారిన పరిస్థితి..
మొత్తానికి 6 నెలల క్రితం వరకు లోక్‌సభ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని భావించారు. ప్రతిపక్షాల ఐకమత్యంతో పరిస్థితి పూర్తిగా మారింది. పోటీ హోరాహోరీగా మారిపోయింది. కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం అనే పరిస్థితి వచ్చింది. ఈ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.