దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయీకి పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. ప్రధానిగా వాజ్పేయీ సేవలకు గుర్తింపుగా ఆయన చిత్రపటాన్ని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు క్లిష్ట సమయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని రాష్ట్రపతి కీర్తించారు. రహదారులు, ఐటీ, టెలికం రంగాల సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు కోవింద్. చిత్రపటాన్ని రూపొందించిన కళాకారుడు కృష్ట కన్నయ్యను రాష్ట్రపతి అభినందించారు.
"ఇప్పటి నుంచి అటల్ జీ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు స్ఫూర్తినిస్తారు. ఆయన సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధాంతాలను వదల్లేదు. అటల్‌జీ గొప్ప వక్త. ఆయన ప్రసంగంలో తెలియని ఓ శక్తి ఉంటుంది. ఆయన మౌనం మరింత శక్తిమంతమైంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి