నగర, పురపాలక సంఘాలకు త్వరలోనే ఎన్నికలు: బొత్స
నగర, పురపాలక సంఘాలకు త్వరలనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆగస్టు 15 నుంచి వార్డు వాలంటీర్ల విధానం అమలవుతుందని చెప్పారు.
విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపల్ కమిషనర్ల కార్యశాలలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. త్వరలో నగరపాలక, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రిజర్వేషన్లు, విలీన గ్రామాలపై కొన్ని అవరోధాలున్నాయన్న మంత్రి... తమది స్నేహపూర్వక ప్రభుత్వమని చెప్పారు. ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు ఉండవని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కాకుండా కాగితాల్లో అంతా బాగుందనే భావన తేవొద్దని అన్నారు. పట్టణాలు, నగరాల్లో తాగునీరు, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కమిషనర్లు... బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లి సహకరించాలని సూచించారు. అలసత్వంతో వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆగస్టు 15 నుంచి వార్డు వాలంటీర్ల విధానం అమలవుతుందని తెలిపారు.