ప్రజల్లో ఉంటూ..సమస్యలపై పోరాడతా: లోకేశ్ - ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరిలో గెలిచిన వైకాపా అభ్యర్థికి తెదేపా నేత లోకేశ్ అభినందనలు తెలిపారు. ప్రజాతీర్పును స్వాగతిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. తెదేపా విజయానికి అహర్నిశలు కృషిచేసిన ప్రతీ కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి తనపై ఎమ్మెల్యేగా గెలిచిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. నామినేషన్ వేసిన నుంచీ కౌంటింగ్ వరకూ అహర్నిశలు తెదేపా విజయం కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ఎన్నికలలో పోటీచేసిన తనకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు సహకరించి రాష్ట్ర ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ... మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు.