అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఒకే రోజు మూడు గ్రామాల వారికి విత్తనాలు సరఫరా చేస్తున్నందున అన్నదాతలు విత్తన కేంద్రం ముందు క్యూకట్టారు. రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణతో ఖరీప్ సాగు వేగం పుంజుకుంది. విత్తనాల కొరతతో విత్తులకు ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నిరసన
జిల్లాలో గత 15 రోజులుగా విత్తన సరఫరా జరుగుతున్నా...ఇంకా సరిపడిన విత్తనాలు లభించకపోవటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. విత్తన కొరతను నిరసిస్తూ.. ఈ తెల్లవారు జామున కళ్యాణదుర్గం టీ-సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. రైతుల నిరసనతో వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వర్షాలు పడుతున్న తరుణంలో విత్తనాలు అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం స్టాక్ లేదని రైతులకు పోలీసులు తెలిపారు. అయినా రైతులు ఆందోళనలు విరమించకపోవటంతో రైతులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.