రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజన్న బడిబాట రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంబంధిత అధికారులతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. బడిబాటలో భాగంగా.. తొలిరోజు స్వాగత సంబరం.. రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. బడి మానేసే వారి సంఖ్య తగ్గాలని.. విద్యార్థుల శాతం పెరిగేలా డీఈవోలు, ఎంఈవోలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సహపంక్తి భోజనాలతో రాజన్న బడిబాట కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. త్వరలోనే తన చాంబర్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయిస్తానన్న మంత్రి.. విద్యాశాఖలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి పనినీ గణాంకాల రూపంలో ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థల్లో ఫీజులు నియంత్రిస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు.