ఆంధ్రప్రదేశ్ రెండో శాసనసభ తొలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 174 మంది శాసన సభ్యులను ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్గా తమ్మినేని సీతారామ్ అధికారిక ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. నేటి నుంచి 18వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తొలిసారి ప్రభుత్వ అధినేత హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నేడు..సభలో శాసనసభ్యుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వెంకట చిన అప్పల నాయుడు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం జగన్ ప్రమాణం చేసిన అనంతరం ప్రతిపక్షనేత చంద్రబాబు, అనంతరం మంత్రులు, తరువాత శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును స్పీకర్ హోదాకు సీఎం జగన్ ఖరారు చేసినందున...స్పీకర్ ఎన్నిక లాంచనంగానే జరుగుతుంది.