ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి అమలుచేయండి : ఏపీపీఎస్ఏ నాయకులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్(ఏపీపీఎస్ఏ) నాయకులు కోరారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల వలే అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లులకు వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మ ఒడి వర్తింపజేస్తే లక్షలాది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేసి ప్రైవేట్ పాఠశాలలకు అమ్మఒడి అమలు చేయాలని కోరారు.