కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో ర్యాలీ నిర్వహించనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం కాంగ్రెస్ గాంధీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
1990 మండల్ కమిషన్ వచ్చిన నాటి నుంచి బిహార్లో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతి పెద్ద సభతో తిరిగి పార్టీని రాష్ట్రంలో పటిష్టపరిచేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
బహిరంగ సభకు మహాకూటమి నేతలు:
కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు తేజస్వీయాదవ్, ఉపేందర్ కుష్వాహా, జతిన్ రామ్ మాంఝీలను ఆహ్వానించారు. మహా కూటమికి మద్దతు తెలుపుతున్న ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏమ్(మాంఝీ) నేతలు హాజరవనున్నారు.
బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గత కొంత కాలం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 400 బహిరంగ సభలు నిర్వహించింది. నేడు జరగనున్న భారీ బహిరంగ సభలో అత్యధికంగా హజరు కానున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇది రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుకూల ప్రభావాన్ని చూపనుందని వారు చెబుతున్నారు.
పట్నా వ్యాప్తంగా 3వేల మంది భద్రతా బలగాలను మోహరించనున్నట్లు పట్నా ఎస్పీ గరీమా మాలిక్ తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాంధీ మైదానంలో 100సీసీటీవీ లను నెలకొల్పినట్లు ఆయన తెలిపారు.