ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పర్యాటకులే రాని పులివెందులలో స్టార్‌ హోటల్​ - 12 కోట్లకు జగన్​ అనుయాయుడి క్లబ్‌హౌస్‌ కొనుగోలు - JAGAN STAR HOTEL IN PULIVENDULA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 7:02 AM IST

YS Jagan Star Hotel Plan in Pulivendula: పర్యాటకులే రాని పులివెందులలో స్టార్‌ హోటల్‌ కట్టేందుకు ప్రైవేటు క్లబ్‌హౌస్‌ను వైఎస్​ జగన్​ ఏపీటీడీసీతో రూ.12.87 కోట్లతో కొనిపించారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం భూములు, స్థలాలు కేటాయించే పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ క్లబ్‌హౌస్‌ కొనుగోలు విషయంలో విరుద్ధంగా వ్యవహరించింది. దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం అండగా నిలిచారు.

YS Jagan Four Star Hotel Plan in Pulivendula
YS Jagan Four Star Hotel Plan in Pulivendula (ETV Bharat)

YS Jagan Star Hotel Plan in Pulivendula:ఎక్కడైనా సందర్శకులు, పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు కడతారు. కానీ మన మాజీ సీఎం జగన్‌ సారు మాత్రం సందర్శకులే రాని పులివెందుల్లో స్టార్‌ హోటల్‌ కట్టేందుకని ప్రైవేటు క్లబ్‌హౌస్‌ను ఏపీటీడీసీతో రూ.12.87 కోట్లతో కొనిపించారు. అంతేనా మరో రూ.23.50 కోట్లతో దాన్ని స్టార్‌ హోటల్‌గా మార్చేందుకు టెండర్లు పిలిపించారు. ఇంతకీ ఈ ప్రైవేటు క్లబ్‌హౌస్‌ ఎవరిదో తెలుసా వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి బావ వరసయ్యే విజయభాస్కర్‌ రెడ్డిది. దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం వంతపాడారు. తన సొంత వారికి మేలు చేసేందుకు రాష్ట్ర వనరుల్ని ఎలా వాడేసుకున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఓ పెద్ద ఉదాహరణ.

వైఎస్సార్సీపీ అరాచకాలపై ప్రభుత్వం దృష్టి - శాఖల వారీగా రిపోర్టులు - ap Govt Focus on YSRCP Anarchies

పర్యాటకరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకు భూములు, స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పులివెందులలో క్లబ్‌హౌస్‌ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందులలోని విజయ హోమ్స్‌లో వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి బావ వరసయ్యే చవ్వ విజయభాస్కర్‌ రెడ్డికి చెందిన 1.71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్‌ హౌస్‌ను రూ.12.87 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం పర్యాటకాభివృద్ధి సంస్థ అప్పటి ఛైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి, సభ్యులుగా ఉన్న పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కన్నబాబు, ఇతర సభ్యులు తీర్మానం చేశారు.

ప్రభుత్వ స్థలంలో వైసీపీ నేత కట్టడం - కూల్చివేసిన అధికారులు - YSRCP leader occupying govt land

పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్‌ రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1.71 ఎకరాల స్థలం 1,65,52,800కు, అందులో 46,050 చదరపు అడుగుల్లో నిర్మించిన నిర్మాణాలను 7,46,19,600కు కొన్నారు. మొత్తం 9,11,72,400పై సవరించిన విలువ కింద మరో 41.18శాతం జతచేసి 12,87,17,100 చెల్లించారు. 2023 సెప్టెంబరు 26న విజయవాడలోని పటమట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్‌ జరిగింది.

క్లబ్‌హౌస్‌ను ఫోర్‌స్టార్‌ హోటల్‌గా రూ. 23.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు పిలిచారు. 2023-24 బడ్జెట్‌ నుంచి నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం చేశారు. దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. టెండర్‌ ఖరారు చేసిన పడా అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పనులు ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం తిరిగింది. ఇప్పటివరకైతే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దుచేయలేదు.

వీరు మారరా.. వీరి బుద్ది మారదా? - ప్రభుత్వం మారిన వైసీపీ సేవలో తరిస్తున్న అధికారులు - Govt officers supporting to YCP

గత ఐదేళ్లలో పర్యాటక రంగ అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థను దివాలా తీయించారు. రుషికొండపై లక్షణంగా ఉన్న హోటల్, రెస్టారెంట్, సమావేశ మందిరం, ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం నిర్మించారు. రుషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాల తొలగింపుతో పర్యాటకాభివృద్ధి సంస్థ గత మూడేళ్లలో 10 కోట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా విద్యుత్తు ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్టుల మరమ్మతులకు నిధుల్లేవంటూ గత ఐదేళ్లూ బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు 12.87 కోట్లతో ఆఘమేఘాలపై క్లబ్‌ హౌస్‌ కొనేశారు. ఈ విషయాన్ని ఏడాదిన్నరగా గోప్యంగా ఉంచారు. పులివెందులలో స్టార్‌ హోటల్‌ నిర్మిస్తే సంస్థకు ఉపయోగం ఉంటుందా? అని అధికారులు ఆలోచించలేదు. సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలూపారు. 12.87 కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే. దీనికి ఎవరు బాధ్యులు? కొన్న ధరకు విక్రయించినా కొనేవారు లేరు. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

పచ్చదనం మాటున వైఎస్సార్సీపీ నేతల దోపిడీ - చర్యలకు జనసేన డిమాండ్ - Corruption in plant breeding

ABOUT THE AUTHOR

...view details