Vinayaka Chavithi Celebrations Across The State: రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి పండుగ సందడి నెలకొంది. తొలిపూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా వివిధ రూపాల్లో గణనాథుల్ని కొలువుదీర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఆకట్టుకుంటున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చతుర్థి శోభ నెలకొంది. ఆది దేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఖరీదైన లంబోదరుడిని ఏర్పాటు చేశారు. తంజావూరు ఆలయం తరహా సెట్టింగ్ వేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంతరాలయాన్ని అలంకరించారు. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చలువ పందిళ్లలో గణనాథులు కొలువుతీరారు.
బాహుబలి తరహాలో పందిరి సెట్టింగ్: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పలు పాఠశాలల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు దక్షిణ బజార్‌లో 33 అడుగల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమతా నగర్‌లో 15 వందల కొబ్బరి కాయలతో 15 అడుగుల ఎత్తులో వినాయకుడ్ని ప్రతిష్టించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రంథాలయం వీధిలో బాహుబలి తరహాలో సెట్టింగ్ వేసి వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కడపలో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశాయి. కర్నూలులో భారీ వాహానాల్లో వినాయక విగ్రహాలను నిర్వాహకులు మండపాలకు తీసుకువచ్చారు. పూజసామగ్రి కొనేందుకు వచ్చినవారితో బజార్లు కిటకిటలాడాయి.