12th August Librarian Day :గ్రంథాలయ శాస్త్రపిత ఎస్.ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధి, గ్రంథాలయాల నిర్వాహణ, పఠనం ప్రాధాన్యత కోసం అనేక పుస్తకాల్ని రంగనాథన్ రచించారు. పుస్తక పఠనం ద్వారానే పూర్తి విజ్ఞానం సాధ్యమవుతుందని నమ్మిన గొప్ప వ్యక్తి రంగనాథన్. సమాజ అభివృద్ధికి, ప్రజల విజ్ఞానానికి లైబ్రరీలు ఎంతో దోహదం చేస్తాయని ఎస్.ఆర్ రంగనాథన్ తెలిపారు.
తమిళనాడులో జన్మించిన రంగనాథన్ : గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి ఎస్.ఆర్ రంగనాథన్ చేసిన కృషికి భారత ప్రభుత్వం 1957లోనే పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 1965లో గ్రంథాలయ శాస్త్ర జాతీయ పరిశోధనాచార్యునిగా నియమించి గౌరవించింది. అంతకంటే ముందు బ్రిటీష్ పాలనలోనే రంగనాథన్‌కు రావు సౌహెబ్ బిరుదుతో 1935లో సత్కరించింది. వీటితో పాటు రంగనాథన్ గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. 1892 ఆగస్టు 12న తమిళనాడులోని తంజావూరు జిల్లా షియాలిలో రంగనాథన్ జన్మించారు. ఇవాళ ఆయన132వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రంథాలయ పాలకుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బస్సులో మినీ లైబ్రరీ - యువ డ్రైవర్ వినూత్న ఆలోచన - MINI LIBRARY IN BUS
వివిధ అంశాలపైన గ్రంథ పాలకులు దృష్టి : విజ్ఞానాన్ని పెంపొందించడంలో పుస్తకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అలాంటి పుస్తకాలను సంరక్షించి భవిష్యత్తు తరాలకు అందించడంలో లైబ్రరీయన్స్ కీలకంగా వ్యవహరిస్తారు. వేల ఏళ్లనాటి చరిత్రను పదిలపరిచేది గ్రంథాలయాలే. అలాంటి లైబ్రరీల నిర్వాహణ ఎలా ఉండాలి. గ్రంథ పఠనం ఎలా చేయాలి. పాఠకులను గ్రంథ పఠనానికి ఎలా అలవాటు చేయాలి వంటి అనేక విషయాలపైన పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకునే వాడే మంచి లైబ్రేరియన్ అవుతాడు. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతుందని అనేక పరిశోధనలు తేల్చాయి. అయితే పాఠకులను ఆకర్షించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి. శాస్త్ర సాంకేతిక విధానాలను ఆచరించి పాఠకులకు కావాల్సిన సమచారం, పుస్తకాలను త్వరగా ఎలా అందజేయాలి అనే అంశాలపైన గ్రంథ పాలకులు దృష్టి సారిస్తున్నారు.