Revenue employees protest: విశాఖలో అర్ధరాత్రి జరిగిన తహశీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఏకంగా అధికారి ఇంటికి వెళ్లి ఇనుపరాడ్‌తో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. స్థిరాస్తి వ్యాపారం, భూవివాదాలే తహశీల్దార్ హత్యకు దారితీసినట్లు అధికారులు చెబుతున్నారు. తహశీల్దార్ హత్యను ఖండిస్తూ ఆందోళనకు దిగిన రెవెన్యూ సంఘాలు... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. జగన్ పాలనలో మండల స్థాయి అధికారి ప్రాణాలకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు.
బాధ్యతలు చేపట్టిన రోజే హత్య: విశాఖ జిల్లా చినగదిలి రూరల్ తహసీల్దారుగా విధులు నిర్వహించిన సనపల రమణయ్యపై శుక్రవారం రాత్రి ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడివున్న రమణయ్యను ఆయన బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ. విశాఖ కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్స్ అపార్టుమెంట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్, భూవివాదాలే తహశీల్దార్ రమణయ్య హత్యకు కారణమని సీపీ రవిశంకర్ తెలిపారు. హత్య కేసు నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు.ఇద్దరు ఏసీపీలను నియమించి కేసు దర్యాప్తు చేస్తుస్తున్నామన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.
ఎమ్మార్వో రమణయ్య హత్యపై తీవ్రంగా స్పందించిన రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు