New Year 2025 Liquor Sales in AP :న్యూ ఇయర్ వేడుకలు అంటేనే విందు, వినోదానికి పెట్టింది పేరు. ఇప్పటికే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాల్లో రికార్డులు సృష్టించిన మద్యం ప్రియులు. తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే మందుబాబులు దాదాపు రూ.200 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. 60 లక్షల మద్యం క్వార్టర్లు, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు.
మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో 2 గంటలపాటు విక్రయాలకు ఈ సారి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తంగా 14 గంటలపాటు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన గంటకు సగటున దాదాపు రూ.14.28 కోట్ల విలువైన మద్యం అమ్మారు. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుంచి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తుంటారు.