హెటిరో-అరబిందో స'మేత' జగన్మాయ! Illegal Investments in YS Jagan Companies Case :వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. తన కంపెనీల్లోకి అక్రమంగా పెట్టుబడులు మళ్లించుకుని ప్రతిఫలంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టిన ఘనుడు మన జగన్ ఉమ్మడి ఏపీకి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 250 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటైంది. ఈ సెజ్‌లో తమకు చెరో 75 ఎకరాలు కావాలంటూ అరబిందో, హెటిరో ఫార్మా సంస్థలు దరఖాస్తు చేసుకోవడం అదేరోజు భూమి కేటాయించడం ఆఘమేఘాలపై జరిగిపోయాయి. ఇదంతా జగన్మాయలో భాగమే. ఆ రెండు సంస్థలకు భూ కేటాయింపుల కమిటీ నిర్ణయించిన ధరలో సగం సొమ్ముకే చెరో 75 ఎకరాలు కట్టబెట్టారు. ఇదంతా పరిశ్రమలను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించేందుకు చేసిన గొప్ప పని అనుకుంటే పొరపడినట్లే.
Jagan Assets Case :ఆ రెండు సంస్థలకు ప్రభుత్వ భూములు కారుచౌకగా కట్టబెట్టినందుకు బదులుగా జగన్ సంస్థల్లోకి 29.50 కోట్లు వచ్చిపడినట్లు సీబీఐ, ఈడీ వెల్లడించాయి. ఈ కేసులోజగన్‌ను A1గా, విజయసాయిరెడ్డిని A2గా పేర్కొంటూ రెండు దర్యాప్తు సంస్థలు ఛార్జిషీటు దాఖలు చేశాయి. అరబిందో, హెటిరో గ్రూపులను, జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ ఫ్రాస్టక్చ్రర్ ప్రైవేట్ లిమిటెడ్‌నూ నిందితులుగా చేర్చాయి. ఇప్పటికి ఈ కేసు నమోదై పదకొండేళ్లయినా విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులు పదేపదే వాయిదా కోరడంతో దర్యాప్తు జరగడం లేదు. సీబీఐ కేసు 264 సార్లు, ఈడీ కేసు 86 సార్లు వాయిదాలు పడ్డాయి.
పచ్చదనానికి పాతరేసి - వందల కోట్లు దోచేసి - జగన్ ముఠా మార్క్!
అడిగిన రోజే భూములు అప్పగించడం ఒక ఎత్తైతే వారు చెప్పిన ధరకే కట్టబెట్టడం మరో దారుణం. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం పారిశ్రామిక పార్కుల్లో భూమి ధరలను కమిటీ నిర్ణయిస్తుంది. కొత్త పారిశ్రామిక పార్కుల్లో భూకేటాయింపుల కోసం రెండు పత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు విస్తృత ప్రచారం చేయాలి. దరఖాస్తులతోపాటు భూమి, ప్రాజెక్ట్ ఖర్చులో 10 శాతం ఈఎమ్‌డీ స్వీకరించి వాటిని ప్లాట్ కేటాయింపు కమిటీకి పంపించాలి. సాధారణంగా భూమికోసం దరఖాస్తు చేసిన కంపెనీలు ఎంత కోరుకుంటే అంత భూమి ఇవ్వరు.
ఆ సంస్థకు ఎంత అవసరమో ప్లాట్ కేటాయింపు కమిటీ, ధరల నిర్ణయ కమిటీ నిర్థరిస్తుంది. కానీ ఈ రెండు సంస్థలకు భూ కేటాయింపుల్లో అందుకు విరుద్ధంగా వ్యవహించారు. జడ్చర్ల సెజ్‌లో ఎకరా ధరను 15 లక్షలుగా ధరల నిర్ణయాక కమిటీ ఖరారు చేయగా అస్మదీయ సంస్థలు అడిగిందే తడవుగా 7 లక్షలకే చెరో 75 ఎకరాలు కేటాయించారు. అప్పటి ఏపీఐఐసీ వీసీ, ఎండీ బీపీ ఆచార్య వారితో కుమ్మక్కై వాళ్లు దరఖాస్తు చేసిన రోజే ఆమోదించారు.
దస్త్రాలు అదే రోజున ప్రాజెక్ట్స్ సీజీఎం, జీఎం, డీజీఎంల వద్దకూ వెళ్లి తుది నిర్ణయం కోసం మళ్లీ బీపీ ఆచార్య వద్దకే వచ్చేశాయి. అయితే ధరల నిర్ణయ కమిటీ నిర్ణయించిన ఎకరం 15లక్షల లీజుతో కేటాయించేలా నోట్ వెళ్లింది. దీంతో ప్రాజెక్ట్స్ విభాగం సీజీఎం రామచంద్రన్‌ను బీపీ ఆచార్య పిలిపించుకుని ఎకరం 7లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించేందుకు సీఎం వైఎస్ అంగీకరించారని, దానికి అనుగుణంగానే ఆఫర్ లెటర్లు సిద్ధం చేయాలని నోటిమాటగా చెప్పారు.
వెంటనే అధికారులు ఆమేరకు లీజు ధర, దానిపై ఏటా ఒకశాతం అద్దె చెల్లించేలా చెరో 75 ఎకరాలకు ఆఫర్ లెటర్లు సిద్ధం చేశారు. వాటిని బీఆచార్య స్వయంగా తీసుకెళ్లి సీఎం వైఎస్‌కు అందజేయగా ఆయన వాటిని అరబిందో, హెటిరో సంస్థలకు అందజేయడం చకచకా జరిగిపోయింది. ఈ రెండు సంస్థల కన్నా ముందే లీ ఫార్మా అనే సంస్థ భూముల కోసం దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోలేదు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ అలాస్యానికి కారణమెంటీ : సుప్రీం కోర్టు
ఇచ్చిందే తక్కువ ధరకే అయినా ఆ మొత్తం కూడా అస్మదీయ సంస్థలు చెల్లించలేదు. 2007 మార్చిలో అరబిందో కంపెనీ 75 ఎకరాలకు 5.25 కోట్ల లీజు ధర చెల్లించగా హెటిరో మాత్రం 3.88 కోట్లే చెల్లించింది. దాంతో అరబిందోకు 75 ఎకరాలు, హెటిరోకు 50 ఎకరాలే కేటాయించారు. మిగతా డబ్బును చెల్లిస్తామని తమకూ మొత్తం 75 ఎకరాలు ఇవ్వాలని హెటిరో ఎండీ శ్రీనివాస్‌రెడ్డి కోరగానే బీపీ ఆచార్య మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడి సరే అన్నారు. భూముల లీజు ద్వారా వచ్చే సొమ్ములు కన్నా మౌలిక సదుపాయల కల్పనకే ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని, భూ కేటాయింపు కొంత తగ్గించాలని ప్రాజెక్ట్ విభాగం సీబీఎమ్ రామచంద్రన్ సిఫార్సు చేసినా సీఎం వైఎస్ పేరు చెప్పి బీపీ ఆచార్య అధికారుల నోరు నొక్కారు. ఫలితంగా అరబిందో, హెటిరో సంస్థలకు చేరో 8.60 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది.
అరబిందో సంస్థపై జగన్‌కు అవిభాజ్యమైన ప్రేమ ఉంది. జడ్చర్ల సెజ్‌లో కారు చౌకగా భూమిని కట్టబెట్టడమేగాక మెదక్ జిల్లా పాశమైలారంలోని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఇండస్టియ్రల్ పార్కులోనూ 2005లో అరబిందో ఫార్మాకు ఎకరం 6.07 లక్షల చొప్పున 30.33 ఎకరలు కేటాయించారు. ఆ భూమి ఇతరులకు విక్రయించడానికి నిబంధనలు అంగీకరించకున్నా దాన్ని తమ సొంత సబ్సిడరీ కంపెనీ ఏపీఎల్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్‌కు బదిలీ చేయాలని 2006 జూన్, జులైల ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వైవీఎల్ ప్రసాద్‌కు ఐదు లేఖలు అందాయి. అందుకు అంగీకరించిన జోనల్ మేనేజర్ 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సెప్టెంబరులో సమాధానమిచ్చారు. ఇక్కడా ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య కల్పించుకుని ప్రాసెసింగ్ ఫీజును ఒక శాతానికి కుదించేశారు. అయితే 2006 నవంబరులో భూమిని బదలాయించేప్పుడు మరో నాటకానికి తెరలేపారు. భూమిని ఏపీఎల్ లైఫ్ సైన్సెస్‌కు కాకుండా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పేరిట బదిలీ చేశారు.
అరబిందోకు ట్రైడెంట్ అనుబంధ సంస్థేనా అని కనీసం పరిశీలించలేదు. ఈ ట్రైడెంట్ లైఫ్ సెన్సెస్ సంస్థ ఎవరిదో కాదు, ప్రస్తుత టీటీడీ సభ్యుడు పి.శరత్‌చంద్రారెడ్డిది. జనరిక్ డ్రగ్స్‌పై బయో విశ్లేషణలు చేసేందుకు 2004 సెప్టెంబరు 8న ఈ కంపెనీ ఏర్పాటైంది. కంపెనీ షేర్ క్యాపిటల్ రూ.16 కోట్లు కాగా.. అందులో 75% వాటా శరత్ చంద్రారెడ్డిదే. అరబిందో ఛైర్మన్ పీవీ రాంప్రసాద్‌రెడ్డి కుమారుడు, నిత్యానందరెడ్డి బావమరిదే ఈ శరత్ చంద్రారెడ్డి. భూమి బదిలీ అయ్యే నాటికి అరబిందో ఫార్మాకు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సొంత సబ్సిడరీ సంస్థ కాదని.. బంధువులదని సీబీఐ తేల్చింది. ప్రభుత్వ భూములు అక్రమంగా కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా 2007లో అరబిందో, హెటిరో సంస్థల నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలోనే భారీగానే సొమ్ము చేరింది. విజయసాయిరెడ్డి సాగించిన కుట్రల్లో భాగంగా జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాల్లోకి అరబిందో 10 కోట్లు, హెటిరో సంస్థ 19.50 కోట్లు పెట్టుబడులు పెట్టాయి వెళ్లాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుని జగన్ తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. 2011 ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం 2012 మార్చి 31న తొలి ఛార్జిషీటు దాఖలు చేసింది. జగన్‌ను A1గా, విజయసాయిరెడ్డిని A2గా, అరబిందో, హెటిరో గ్రూపులను A3, A4 నిందితులుగా చేర్చింది. అనంతరం అదే ఏడాది జులై 3న, 2013 ఏప్రిల్ 2న రెండు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. తమపై కేసు కొట్టివేయాలంటూ హెటిరో సంస్థతోపాటు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి 2016 ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసరెడ్డికి సీబీఐ కోర్టుకు హాజరు మినహాయింపు ఇవ్వడంతో పాటు కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాప్రతినిధుల కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2021 నవంబరులో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ హెటిరో శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై హెటిరో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అది పెండింగ్‌లో ఉంది. ఇదే కేసులో జగన్‌తో సహా అరబిందో గ్రూపు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్‌లకు చెందిన నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ కొనసాగుతోంది. సీబీఐ దాఖలు చేసిన కేసు 264 వాయిదాలు పడగా, ఈడీ కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయిన తర్వాత 86 వాయిదాలు పడింది. సీబీఐ పెట్టిన సెక్షన్‌ల కింద నేరం రుజువైతే నిందితులకు కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా యాజజ్జీవ కారాగార శిక్ష పడొచ్చు. ప్రజాప్రతినిధులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడితే అనర్హత వేటుతోపాటు శిక్షాకాలం పూర్తయిన ఆరేళ్ల దాకా తిరిగి పోటీ చేయరాదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నేరం రుజువైతే ఏడేళ్ల దాకా జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.
JAGAN ASSETS CASE : "విచారణ జాప్యం చేసేందుకే.. హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు"