IAS Postings in AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి MM నాయక్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. జాతీయ హెల్త్ మిషన్ డైరక్టర్‌గానూ ఆమెకు అదనపు బాధ్యతలు కేటాయించారు.
ఆమ్రపాలి కాటను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అధారిటీ సీఈఓ గాను పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీలో రిపోర్టు చేసిన ఆ నలుగురు ఐఏఎస్‌లు
కొద్ది రోజుల క్రితమే ఏపీలో రిపోర్టు:కాగా కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు. ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు రిపోర్టు చేశారు. డీఓపీటీ (Department of Personnel & Training) ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో వీరంతా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు.
అసలు వివాదం ఏంటంటే:ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు ఇవ్వగా, అందులో పలువురిని ఆంధ్రప్రదేశ్‌కి, మరికొంత మందిని తెలంగాణకు కేటాయించారు. అయితే విభజన జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీరంతా క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత కొంతమంది పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై దర్యాప్తు జరిపిన క్యాట్ (Central Administrative Tribunal ) 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ 2017లో తెలంగాణ హైకోర్టును డీవోపీటీ ఆశ్రయించింది.
అధికారుల అభ్యర్థనలు, అభ్యంతరాలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డీవోపీటీ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలు, అభ్యర్థనలు, వాదనలను పరిశీలించింది. డీవోపీటీ నిర్ణయమే సరైనదని దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ సిఫార్సు చేసింది. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న అధికారులు ఏపీకి, అక్కడ పనిచేస్తున్న అధికారులు తెలంగాణకు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఆదేశించింది.
అనంతరం డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే ఐఏఎస్‌ల అభ్యర్థనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. దీంతో మరోసారి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. హైకోర్టులో కూడా ఐఏఎస్ అధికారులకు ఊరట దక్కలేదు. ఐఏఎస్‌ల పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. దీంతో వీరంతా ఏపీలో రిపోర్టు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ ఇచ్చింది.
ఐఏఎస్‌లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు