High Court on CBI SP Ram Singh Petition: తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ 2022లో దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిపింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించాననే ఆరోపణలతో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు అవరోధం కలిగించేందుకు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని రామ్‌సింగ్ తరఫు న్యాయవాది యజ్ఞదత్ వాదనలు వినిపించారు. పిటిషనర్, ఫిర్యాదిదారు తరఫు న్యాయవాదుల ప్రాథమిక వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తుది విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.
వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్ బెదిరిస్తున్నారని, తదితర ఆరోపణలతో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్/స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు దానిని దర్యాప్తు నిమిత్తం మెమో రూపంలో పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేసింది. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో రిమ్స్ పీఎస్ పోలీసులు సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని అప్పట్లో రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట - high court on ys sunitha petition
ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ 2022 ఫిబ్రవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం హైకోర్టులో తాజాగా విచారణకు వచ్చింది. ఫిర్యాదిదారు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తరఫున ఓ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసును కొట్టేయాలంటూ రామ్‌సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చిందన్నారు. ప్రస్తుత కేసులోనూ అవే ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
రామ్‌సింగ్ తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్ ఈ వాదనలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రిమినల్ కేసులు వేటికవే ప్రత్యేకం అన్నారు. ఆయా కేసులలోని వాస్తవాలు, ఆధారాలు, కోర్టు ముందున్న వివరాలను పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం నిర్ణయం వెల్లడిస్తుందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఆవరోధం కలిగించడం కోసం, పిటిషనర్‌ను భయాందోళనకు గురి చేసేందుకు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. సీబీఐ దర్యాప్తు ఆధికారులకు దిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందన్నారు.
యాంత్రిక ధోరణిలో మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారన్నారు. ఈ ఆంశాలను పరిగణనలోకి తీసుకొని హైకోర్టు గతంలో పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున ఏపీపీ స్పందిస్తూ, తాము కౌంటర్ దాఖలు చేయడం లేదన్నారు. ఇరువైపు ప్రాథమిక వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.
వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం - Viveka Watchman Ranganna