Farewell Parade For Retirement Of DGP Dwaraka Tirumala Rao :తన జీవితంలో ఇవి ఉద్విగ్న భరిత క్షణాలని పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ సభలో డీజీపీ ద్వారక తిరుమలరావు వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా తనని అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్ గా అనిపించిందన్నారు. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న తనకు అనేక మంది సహకరించారని గుర్తుచేసుకున్నారు. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశానని ద్వారకతిరుమలరావు తెలిపారు. సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామన్నారు. సైబర్ క్రైమ్, గంజాయి, మహిళలు, చిన్నారులపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు :విపత్తుల సమయంలో ఏపీ పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని కొనియడారు. యూనిఫాం ధరించిన వారు అందరికీ న్యాయం అందించాలని కోరారు. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కేసుల విచారణలో నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ద్వారక తిరుమలరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశానన్నారు. వీధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. సర్వీసులో ఎన్నో జ్ఞాపకాలు, గుణపాఠాలు, పరిచయాలు, ఎమోషన్స్ కలిగి ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందన్నారు.