Drinking Water Proplem in Vijayawada : కృష్ణమ్మ పక్కనే ఉంది. అయినా విజయవాడ నగరవాసులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నగరంలో పలు కాలనీల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కాకుండా ఇంటింటికీ కుళాయి ద్వారా బోరు నీళ్లను అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇష్టారీతిన పన్నులు కట్టించుకుంటూ బోరు నీళ్లు సరఫరా చేయడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు.
Vijayawada Water Issue : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని 9, 11 డివిజన్లలోని పలు కాలనీలు, 12, 13, 14 డివిజన్లలోని అన్ని ప్రాంతాలకు బోరునీళ్లే సరఫరా అవుతోంది. నాలుగేళ్ల క్రితం వరకూ ఈ ప్రాంతాల వాసులు స్వచ్ఛమైన నీరు తాగేవారు. ఐతే గంగిరెద్దుల దిబ్బ వద్ద నిర్మించిన రిజర్వాయర్ సామర్థ్యం అన్ని ప్రాంతాలకు మంచి నీరు సరఫరా చేసేందుకు సరిపోకపోవడంతో బోరు నీళ్లు అందిస్తున్నారు. జేడీ నగర్‌లో మూడు వేల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకుల్లో ఐదు బోర్ల సహాయంతో నీళ్లు నింపుతున్నారు. వాటినే ఈ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఈ బోరు నీటిలో చెత్త వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
వీఎంసీ (VMC) అందిస్తున్న బోరు నీళ్లు శుభ్రంగా లేకపోవడంతో తాగడానికి, వంట చేసుకునేందుకు వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. నీటి కోసం నెలకి వెయ్యి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వీఎంసీకి పన్నులు చెల్లిస్తూ బయట నుంచి నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు.