Damaged Roads in Prathipadu Constituency: కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రహదారులు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కత్తిపూడి నుంచి రౌతులపూడి వెళ్లే 20 కిలోమీటర్ల రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఆర్ అండ్ బీ రహదారిపై గుంతలు దర్శనమిస్తున్నాయి. కంకర రాళ్లు తేలి ప్రయాణానికి ప్రతికూలంగా మారాయి.
ఈ రహదారిపై నిత్యం క్వారీ లారీలు భారీ సంఖ్యలో ప్రయాణిస్తుంటాయి. అసలే దెబ్బతిన్న ఈ రోడ్డుపై క్వారీ లారీలు దూసుకెళ్తుండటంతో దుమ్ము, ధూళితో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు నిత్యం కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్లేందుకు ఇదే మార్గం. తీవ్రంగా దెబ్బతిన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా ఏలూరు - కైకలూరు ప్రధాన రహదారి
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాలను కలిపే శంఖవరం-పెద్దమల్లాపురం-వేలంగి ప్రధాన రహదారి దుస్థితి మరింత దయనీయంగా మారింది. 22 కిలోమీటర్ల ఈ దారి దశాబ్ద కాలంగా తీవ్రంగా దెబ్బతింది. అత్యధిక సంఖ్యలో గిరిజనులు, రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్ని శంఖవరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చేరవేయాలంటే ఈ రోడ్డుపైనే ప్రయాణించాలి.
అడుగుకో గొయ్యితో కంకర రాళ్లు తేలిపోయిన ఈ మార్గంలో ప్రయాణం ప్రసహనంగా మారింది. గిరిజనులు ఆసుపత్రులు, మండల కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్ర కాకినాడకు వివిధ పనులపై రాకపోకలు సాగించేంది ఈ రోడ్డుపైనే. రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో వాహనదారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.