ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీల హడావుడి - నిలువెత్తు ఇసుకలో 'నిజాలకు పాతర'! - ఇసుక రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీలు

Collectors Inspections in Sand Reaches: ఇసుక రీచ్‌ల తనిఖీలనే జగన్నాటకాన్ని పలు జిల్లాల్లో కలెక్టర్లు రక్తికట్టించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి వెళ్లి ఇసుక రీచ్‌లు తనిఖీలు చేసినట్లు, అక్కడ ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని గుర్తించినట్లు, ఉల్లంఘనలేవీ లేవన్నట్లు తనిఖీల నాటకానికి జీవం పోశారు. అక్రమ తవ్వకాలపై క్షేత్రసాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశిస్తే ఉత్తుత్తి తనిఖీలు చేసి మమ అనిపించారు.

Collectors_Inspections_in_Sand_Reaches
Collectors_Inspections_in_Sand_Reaches

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 8:30 AM IST

రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీల హడావుడి - నిలువెత్తు ఇసుకలో 'నిజాలకు పాతర'!

Collectors Inspections in Sand Reaches : పర్యావరణ అనుమతులు లేకపోయినా దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారని, ఎన్జీటీ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్‌ ఇటీవల ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి నదుల్లో పరిశీలించి ఈ నెల 14 నాటికి నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు సోమ, మంగళవారాల్లో గనులు, జలవనరులు, భూగర్భజల శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ప్రత్యేక కార్యదళం అధికారులతో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. అన్ని చోట్లా ఏదో వెళ్లామా? చూశామా? వచ్చామా? అనేలా ముగించారు. ఏయే రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.

Illegal Sand Mining in AP :అధికార పార్టీకి చెందిన ఏ నేత ఆధ్వర్యంలో అక్రమ దందా సాగుతుందో కలెక్టర్‌ నుంచి అన్ని శాఖల అధికారులకు తెలిసినా అలాంటి రీచ్‌ల జోలికి వెళ్లలేదు. చాలా కాలంగా ఎటువంటి తవ్వకాలు లేని, అప్పుడప్పుడు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించే రీచ్‌ల్లో మాత్రమే తనిఖీలు చేశారు. సోమ, మంగళవారాల్లో కలెక్టర్లు తనిఖీ చేయనున్నట్లు ఇసుకాసురులకు ముందే సమాచారం అందడంతో పలు రీచ్‌ల్లో తవ్వకాలకు కొంతసేపు విరామం ఇచ్చారు. కలెక్టర్లు వెళ్లిన వెంటనే ఇసుక దోపిడీ యథావిధిగా కొనసాగింది.

కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలి - అధికారులకు కలెక్టర్​ సూచన

పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని మల్లాది, అచ్చెంపేట మండలం కోనూరు రీచ్‌ల్లో కలెక్టర్‌ శివశంకర్‌ మంగళవారం తనిఖీలు చేశారు. మల్లాది రీచ్‌లో కలెక్టర్‌ తనిఖీలకు వస్తారని సమాచారం ఉండటంతో సోమవారం నుంచి తవ్వకాలు ఆపేసి, యంత్రాలను రీచ్‌ బయటకు తీసుకొచ్చి పెట్టారు. అమరావతి మండలం వైకుంఠపురం రీచ్‌లోనూ తవ్వకాలు ఆపేసి జాగ్రత్త పడ్డారు. అచ్చెంపేట మండలంలోని కేవీపాలెం, కొత్తపల్లి, చామర్రు రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతుండగా, కలెక్టర్‌ బృందం మూడు నెలలుగా తవ్వకాలు ఆగిపోయిన కోనూరు రీచ్‌ను పరిశీలించారు.

యథేచ్చగా అధికారపార్టీ నాయకుల ఇసుక అక్రమ రవాణాలు - లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

కృష్ణా జిల్లాలో ఓ అమాత్యుడు, స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో శ్రీకాకుళం, రొయ్యూరు తదితర రీచ్‌ల్లో నిత్యం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. కలెక్టర్‌ రాజబాబు మాత్రం మంగళవారం మధ్యాహ్నం తోట్లవల్లూరు మండలం నార్త్‌ వల్లూరు రీచ్‌లో తనిఖీ చేశారు. ఇక్కడ దాదాపు రెండేళ్లుగా ఇసుక తవ్వకాలే లేవు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ఇసుక రీచ్‌ల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఆయా జిల్లాలో కలెక్టర్లు అటువైపు తొంగిచూసిన దాఖలాలు లేవు.

మొక్కుబడి తనిఖీలతో నిజాలు కప్పిపుచ్చి ఎన్జీటీకి తప్పుడు నివేదికలు ఇచ్చేందుకు కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోజూ 300లారీలు ₹30లక్షల దందా - అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

ABOUT THE AUTHOR

...view details