CM Chandrababu Participated in Semi Christmas Celebrations: 6 నెలలుగా అహోరాత్రులు పరిశోధిస్తున్నా గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి పరిష్కార మార్గం దొరకడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. విజయవాడలో క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Deputy Speaker Raghurama Krishnaraju)తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 4వ సారి సీఎం అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం ఉన్నా ఆ వెసులుబాటు లేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సార్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
క్రైస్తవ భవనాన్ని పూర్తి చేస్తాం:కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుందని, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీఠ వేస్తుందని స్పష్టం చేశారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్ధిక సాయం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వేమని చంద్రబాబు గుర్తు చేశారు. గత పాలకులు క్రైస్తవ అనుబంధ కళాశాలలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆక్షేపించారు. ఆర్ధిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పని చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.