ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిర్చి రైతులను ఆదుకుంటాం- ధరల స్థిరీకరణపై త్వరలో సరైన నిర్ణయం: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU PRESS MEET IN DELHI

మిర్చి ధరలు ఎప్పుడూ లేనంతంగా పడిపోయాయన్న సీఎం చంద్రబాబు - విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల మిర్చి ధరలు తగ్గాయని వెల్లడి

CM CHANDRABABU
CM CHANDRABABU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2025, 7:53 PM IST

CM CHANDRABABU PRESS MEET IN DELHI: గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది అనూహ్యంగా మిర్చి రేట్లు పడిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కార్యాలయంలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన సీఎం, మిర్చి ఎగుమతులు ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ఏడాది విదేశాల్లో డిమాండ్‌ తగ్గడం వల్ల మిర్చి రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని, రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.

మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మిర్చి ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సాగు ఖర్చులను రియలిస్టిక్‌గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామన్న చంద్రబాబు, రైతులను ఆదుకోవటం గురించి కేంద్రం, రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తున్నాయని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖతో మరిన్ని సంప్రదింపులు జరుగుతాయని, ప్రభుత్వమే సేకరించాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖతో మరిన్ని సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు.

జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు వాడుకుంటాం:అంతకు ముందు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌తోనూ సమావేశమైనట్లు చంద్రబాబు వెల్లడించారు. పోలవరం త్వరితగతిన పూర్తిచేయడం సహా నదుల అనుసంధానానికి సహకరించాలని కోరామన్నారు. 2027 లోపు పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు గురించి చర్చించామని, గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను సరిగా వినియోగించుకోలేదని మండిపడ్డారు. గతంలో ఇంటింటికీ నల్లా నీరు పథకాన్ని నిర్వీర్యం చేశారని, డీపీఆర్‌ రూపొందించి జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు వాడుకుంటామని చెప్పారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకుంటామన్న సీఎం, గత ప్రభుత్వం రూ.27 వేల కోట్ల కేంద్ర నిధులను వాడుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ చేతకానితనం వల్ల కేంద్ర పథకాల నిధులు వాడుకోలేదని దుయ్యబట్టారు.

సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నాం: కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ల వారీగా కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటినే అదనంగా వినియోగించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలోని దేవాదుల ప్రాజెక్టును తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ, ఏపీలో గోదావరి నదిలో మిగులు జలాలు ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నామని చెప్పారు.

వైఎస్ జగన్​పై చంద్రబాబు ఆగ్రహం: ఎన్నికల సంఘం వారించినా వినకుండా కోడ్‌ అమల్లో ఉండగానే జగన్‌ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి హంగామా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తాను తప్పు చేయడమేగాక పోలీసు భద్రత కావాలని కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ - నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చ

'మిర్చి రైతులను ఆదుకోండి' - కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details