CM Chandrababu Fires on YSRCP: రాజధాని అమరావతి నిర్మాణం ఆపేసి ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసింది వైఎస్సార్సీపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును గాలి కొదిలేసి డయాఫ్రాం వాల్‌ను దెబ్బతీసేశారన్నారు. వరదలు వస్తున్నా పట్టించుకోకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమల్ని పారిపోయేలా చేసింది వైఎస్సార్సీపీ అని ఆరోపించారు. తద్వారా మన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లేకుండా పోయాయన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు.
AP Brand Destroyed by YSRCP: పీపీఏలను రద్దు చేయటం ద్వారా కరెంటు వాడుకోకుండా 9 వేల కోట్లు డబ్బులు కట్టాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. కరెంటు ఉన్నా ఎక్కువ రేటుకు బహిరంగ మార్కెట్లో వేలంలో కొని వినియోగదారులపై భారం వేశారన్నారు. ఒక వ్యక్తి అధికారంలో ఉండి చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలంతా ట్రూఅప్ కింద విద్యుత్ బిల్లులపై అదనపు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇసుక మొత్తం దోపిడీ చేసింది వైఎస్సార్సీపీ అని, వారి నిర్వాకం వల్ల నిర్మాణ రంగం దెబ్బతిందన్నారు. మద్యం అయితే ఇక చెప్పాల్సిన పని లేకుండా అక్రమాలు, దోపిడీ చేశారన్నారు. ఒక్క మద్యం షాపులోనూ ఆన్లైన్లో నగదు తీసుకోలేదన్నారు.
ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు
అంతా తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించారు:అక్రమాల్లో దోచిన డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. చెత్తపై పన్ను వేసి ప్రజల జీవన ప్రమాణాల్ని దెబ్బతీశారన్నారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా పోలీసు వ్యవస్థను వినియోగించారన్నారు. కరోనా సమయంలో మాస్కు ఇవ్వమని కోరిన సుధాకర్ అనే వైద్యుడ్ని వేధించి పిచ్చివాడిని చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఒక వ్యక్తిని వేధించిందని మండిపడ్డారు. మూలధన వ్యయానికి తిలోదకాలు ఇచ్చి అస్తవ్యస్తం చేశారన్నారు.
అడవి పందుల తరహాలోనే: తద్వారా రాష్ట్రంలో రహదారులన్నీ పూర్తిగా గుంతలు పడిన పరిస్థితి అని ధ్వజమెత్తారు. అడవి పందులు 10 శాతం పంటను తిని మిగతా 90 శాతం పంటను నాశనం చేస్తామని, అదే తరహాలో ఏపీలోనూ అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేశారని విమర్శించారు. ప్రజలు నమ్మి ఓటేసినందుకు దుర్మార్గంగా పాలన చేశారన్నారు. సంపద సృష్టించేందుకు ఒక్క పనిని, ప్రాజెక్టును కూడా చేపట్టలేదని విమర్శించారు. పెట్టుబడుల కోసం వస్తే పారిశ్రామిక వేత్తలను కూడా తరిమేశారన్నారు. ఈసారి ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోవాలని చాలా మంది చెప్పారన్నారు.
కుటుంబ సభ్యుల కోసం కూడా ప్యాలెస్‌లు:430 కోట్ల ప్రజాధనంతో ఋషికొండ ప్యాలెస్ కట్టేసుకున్నారని, పర్యావరణ విధ్వంసం చేసి కుటుంబ సభ్యుల కోసం కూడా ప్యాలెస్‌లు, ఆఫీస్‌లు కట్టేశారన్నారు. ఎన్జీటీకి, హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. 700 కోట్లతో సర్వే రాళ్లు, పుస్తకాలపై సొంత బొమ్మలేసుకుని దుర్వినియోగం చేశారన్నారు. ఇప్పుడు ఆ బొమ్మలు తీయటానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయన్నారు.
సొంత పత్రికకు 400 కోట్లతో ప్రకటనలు: ప్రభుత్వ భవనాలకు రంగులేశారని, వాలంటీర్లకు సాక్షిపత్రిక ఇచ్చేలా డబ్బులు, సొంత పత్రికకు 400 కోట్లతో ప్రకటనలు ఇచ్చేసుకున్నారని సీఎం తెలిపారు. సోషల్ మీడియాలో సైకోలను కూడా తయారు చేశారన్నారు. కన్న తల్లిపైన కూడా పోస్టులు పెట్టి ఆమె శీలాన్ని కూడా శంకించేలా సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ అవమాన పడేందుకు వీల్లేదని, చట్టానికి పదునుపెట్టి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, మహిళల రక్షణ కోసం కఠినంగా నిర్ణయాలు తీసుకుని ఉక్కుపాదంతో అణచివేస్తామని, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టటం వ్యవస్థీకృత నేరంగా మారిపోయిందని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు
CM on Financial Destruction: రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయినా తమకు ఓ టీవీ, పత్రిక లేవని, కానీ వస్తూనే టీవీ, పత్రిక పెట్టుకుని పార్టీ పెట్టుకున్నారని విమర్శించారు. రైతు బజార్లు, తహసీల్దారు కార్యాలయాలను, హెల్త్ సెంటర్లను తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. పేదలకు చెందిన పథకాలు చాలా మేరకు గండికొట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయకుండా కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. ఇప్పుడు 4 వేల 500 కోట్లతో 30 వేల పనులు సంక్రాంతికే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారని గుర్తుచేశారు.
జల్ జీవన్ మిషన్‌ను పూర్తిగా వినియోగించుకోకుండా నిలిపేశారన్నారు. ఆ ప్రాజెక్టు ఉంటే ఇంటింటికీ కుళాయి వచ్చి సురక్షితమైన తాగునీరు అందరికీ అందేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్ 1 లక్ష కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్‌తో తాగునీరు ఇస్తోందన్నారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం గురించి చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆయనే తొలిసారిగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టలేదని ఎద్దేవాచేశారు.