Crop loans for tenant farmers :కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు దిశగా బ్యాంకర్లు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపుగా 40 వేలమంది కౌలు రైతులకు పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్‌సీ) మంజూరవగా ఇప్పటివరకు 5 వేలమంది రైతులకు రుణాలు మంజూరయ్యాయి. పంట సాగు చేసే వారికి రుణాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.
అర్హులందరికీ రెండు రోజుల్లో రుణాలు
ఏటా కౌలు రైతులకు రూ.వందల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకుంటున్నా ఆచరణలో యంత్రాంగం విఫలమవుతోంది. భూయజమానులు అప్పటికే రుణాలు తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం కాగా, దీనివల్ల సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకోని రైతుల భూములను సాగు చేస్తున్న కౌలురైతులను గుర్తించి వారికి రుణాలివ్వాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రుణాలు తీసుకోని భూయజమానులు సుమారు 12 వేల మంది వరకు ఉన్నారు. అంటే 12 వేల మంది కౌలు రైతులు రుణాలకు అర్హత సాధించినట్టే లెక్క. వీరికి పంటసాగుదారు హక్కుపత్రం (సీసీఆర్‌సీ) కార్డులుంటే వెంటనే దరఖాస్తు చేయిస్తున్నారు.
తిరిగి రెండు రోజుల్లో రుణాలిచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రుణం కోసం దరఖాస్తుతోపాటు భూయజమాని అంగీకార పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భూమి యజమాని అందుబాటులో లేకపోతే బ్యాంకు సిబ్బంది ఫోన్ ద్వారా ఆయన్ను సంప్రదిస్తున్నారు. భూ యజమాని ఆమోదం తీసుకున్న తరువాతే కౌలు రైతులకు రుణం మంజూరు చేస్తారు. కౌలు రైతులకు రుణ మంజూరు అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు ఎక్కడైనా ఇబ్బందులుంటే వాటి పరిష్కారానికి అధికారుల బృందాలు వెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 వరకు ప్రత్యేక బృందాలు పర్యటించనుండగా ఇందులో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో పాటు బ్యాంకర్లు, కౌలురైతు సంఘాల నాయకులు ఉన్నారు.
పంటసాగుదారు హక్కుపత్రం కార్డుల్లేని వారితో రైతుమిత్ర బృందాలు, జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీరు వెంటనే పొదుపు చేసేలా ప్రోత్సహించి, రబీ సీజన్ నుంచి రుణానికి అర్హత పొందేలా చూస్తున్నారు.
కౌలు రైతులకు రుణాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ద్విచక్రవాహనానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రుణాలపై అవగాహన కల్పించడంతో పాటు కౌలు రైతులను సమావేశాలకు తీసుకొచ్చేలా రైతు నాయకులు బాధ్యత తీసుకున్నారు.