Anakapalli ArcelorMittal Plant : ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్ (ఏంఎ/ఎన్‌ఎస్) కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీలు ప్లాంట్(ఐఎస్‌పీ)కు సంబంధించి మొదటి దశలో పెట్టే రూ.70,000ల కోట్ల పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భారీ పెట్టుబడులను అమరావతి నుంచి కాకుండా అదే ప్రాంతం నుంచి ప్రకటించడం వల్ల ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు తెలిసింది. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఈరోజు చంద్రబాబు విశాఖ చేరుకుని అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశం ఉందని తెలిసింది.
జనవరిలో శంకుస్థాపన : ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి వచ్చే సంవత్సరం జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. పరిశ్రమకు అవసరమైన భూముల కేటాయింపు విషయంపై సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి దగ్గర బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కోసం కేటాయించిన 2,000ల ఎకరాల్లో కొంతభాగంతోపాటు విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా నక్కపల్లి పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములను ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సుమారు 5,000ల ఎకరాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఐఎస్‌పీ మొదటి దశ పూర్తైతే సుమారు 20,000ల మందికి ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా భారీగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు.