CM Chandrababu Review on Welfare Issues: గిరిజన ప్రాంతాల్లో ఇక నుంచి డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచనలు చేశారు. గిరిజన, సాంఘిక, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించారు. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఏపీ ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్, అరకు కాఫీ షాప్స్ ఏర్పాటుపై సీఎం చర్చించారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్‌పై సీఎం వివరాలు అడిగి తెలుసు కున్నారు. గతంలో అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం అరకు కాఫీతో పాటు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదని అన్నారు. ఈ విషయంలో సమగ్రమైన మార్పులు రావాలని, గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చని సీఎం అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో పకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని అన్నారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. గిరిజనులు సాగుచేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, అలాగే గిరిజన ఉత్పత్తుల, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు.
పేదరిక నిర్మూలనకు చంద్రబాబు కొత్త ఫార్ములా- నీతి అయోగ్ సమావేశంలో ప్రతిపాదన - CHANDRABABU POLICY
గిరిజన మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేతపై సమీక్షించిన చంద్రబాబు, అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ సంక్షేమంపై, ఎస్సీ వర్గాలకు అందచేయాల్సిన అంశంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమీక్షించారు.