భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో లింగన్న ప్రథమ వర్ధంతి సభ కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల కోసం పోరాడిన ఎందరో విప్లవకారులను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట ప్రభుత్వం హతమార్చిందని పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు ఆరోపించారు.
కామ్రేడ్ లింగన్న ఆదివాసీల భూముల కోసం పోరాటాలు చేశారని.. 22 సంవత్సరాలు పాటు అజ్ఞాత జీవితం గడుపుతూ ప్రజా శ్రేయస్సు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా లింగన్నను చిత్రహింసలకు గురి చేసి మరీ చంపేసిందని మధు అన్నారు. లింగన్న కుటుంబసభ్యులు తమ స్థలంలో స్మారక స్థూపం ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిసిన పోలీసులు దానిని కూల్చివేశారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించిన లింగన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామాలలో ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్