అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల మధ్య తొలి సంవాదం రసవత్తరంగా సాగింది. క్లీవ్‌లాండ్ వేదికగా జరిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య జరిగిన ముఖాముఖి చర్చ అత్యంత వాడీవేడిగా కొనసాగింది. ప్రారంభంలో 'ఎలా ఉన్నావ్?' అంటూ పలకరించుకున్న ఇరువురు నేతలు.. అంతలోనే 'నోరు మూస్తావా?' అని గద్దించే స్థాయికి చేరిందంటే చర్చ తీవ్రత ఎలా సాగిందో అర్థమవుతోంది.
కరోనా నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు షేక్ హ్యాండ్ చేసుకోకుండానే చర్చ ప్రారంభించారు. వీటితో పాటు మరికొన్ని పద్ధతులను మహమ్మారి కారణంగా నిలిపివేశారు. హాల్లోకి 100 కన్నా తక్కువ మందినే అనుమతించారు. ప్రతి అంశంలో బైడెన్‌ను ఇరకాటంలో పెట్టాలన్న తలంపుతో ట్రంప్ చర్చా వేదికపైకి వచ్చారు. సహనం ప్రదర్శిస్తూ బైడెన్.. వేదికపై అడుగుపెట్టారు.
మొదటి ప్రత్యక్ష చర్చలో భాగంగా ఇరువురు నేతలు పలు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు. ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ, వర్ణ వివక్ష, పర్యావరణం సహా అమెరికాలో ఎన్నికల సమగ్రతపై తమ అభిప్రాయాలు, విధానాలను వివరించారు. ఇరువురు నేతల సంవాదం పూర్తి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి--ట్రంప్ X బైడెన్: వాడీవేడిగా తొలి డిబేట్
అసహనం మొదలు
90 నిమిషాల పాటు జరిగిన ఈ ముఖాముఖి చర్చలో ఇరువురు నేతలు తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. బైడెన్‌పై ఆదిపత్య ధోరణితో ప్రసంగం కొనసాగించారు. చర్చ మొదలైన అరగంట తర్వాత కాస్త సహనం కోల్పోయారు ట్రంప్. 'ఒక్క నిమిషం మౌనంగా ఉండండి?' అంటూ బైడెన్‌పై విరుచుకుపడ్డారు.
డిబేట్ తీవ్రత తగ్గిన మరికాసేపటికే ట్రంప్, బైడెన్ మళ్లీ వాదించుకున్నారు. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు అంతరాయం కలిగించారు. 2016, 17లో రాష్ట్ర ప్రభుత్వాలకు 750 డాలర్ల పన్నులు మాత్రమే చెల్లించారన్న విషయంపై సంధానకర్త ప్రశ్నలు సంధిస్తుండగా.. బైడెన్ మధ్యలో కలగజేసుకున్నారు. 'మీ కట్టిన పన్నుల వివరాలు చూపించండి' అంటూ ట్రంప్‌ను పదేపదే కోరారు.
ట్రంప్‌ను 'విదూషకుడు' అంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత అధ్యక్షుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సహనం కోల్పోయిన ట్రంప్ 'అలాగే అరుస్తూ ఉండు' అని మండిపడ్డారు. 'అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు మీరే' అంటూ బైడెన్ తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంధానకర్త జోక్యం
యాభై నిమిషాల తర్వాత ట్రంప్-బైడెన్ మధ్య వాదన తీవ్ర స్థాయికి చేరింది. సంధానకర్తగా క్రిస్ వాలెస్ కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇరువురు శాంతించాలని క్రిస్ అభ్యర్థించారు. 'జెంటిల్మెన్, నా స్వరాన్ని పెంచేందుకు ఇష్టపడటం లేదు, కానీ మీ ఇద్దరితో పోలిస్తే నేను భిన్నంగా ఎందుకుండాలి?' అంటూ సున్నిత హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో బైడెన్‌ను ట్రంప్ నిందించగా.. అధ్యక్షుడిని క్రిస్ తప్పుబట్టారు. 'నిజం చెప్పాలంటే మీరే ఎక్కువగా అంతరాయం కలిగిస్తున్నారు' అని ట్రంప్‌కు చురకలంటించారు.
బెర్నీ శాండర్స్ నుంచి అధ్యక్ష నామినేషన్‌ను బైడెన్ దొంగలించారని ట్రంప్ ఆరోపించారు. దీనిపై బైడెన్ ఘాటుగా స్పందించారు. 'ఆయన ఇప్పటివరకు చెప్పినవన్నీ అబద్దాలు. ఆయన అబద్దాలు చెబుతారని అందరికీ తెలుసు' అన్నారు. అభ్యర్థుల మధ్య వాడీవేడి చర్చ.. కొన్ని సమయాల్లో స్కుల్ పిల్లల అల్లరిని తలపించింది.
ఇదీ చూడండి- ట్రంప్ X బైడెన్: ఆఫ్రోఅమెరికన్లను చిన్నచూపు చూసిందెవరు?