కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మొదటి కరోనా కేసు నమోదైంది. చిన్న ఓరంపాడు పంచాయితీ పరిధిలోని దిగువ పల్లి కి చెందిన వ్యక్తి.. చెన్నైలోని ఆసుపత్రికి మందుల కోసం వెళ్లినప్పుడు.. అక్కడి కాంటాక్ట్ ద్వారా కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు. ఓబులవారిపల్లె కు చెందిన ఈ వ్యక్తి చెన్నై నుంచి వచ్చాడని తెలుసుకున్న అధికారులు.. పరీక్షలు చేయించారు. కరోనా నిర్థరణ అయిన మేరకు.. కడప ఫాతిమా కాలేజ్ క్వారంటైన్ కు తరలించారు.
రాజంపేట ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి , డీఎస్పీ స్వామి నారాయణ రెడ్డి, రైల్వే కోడూరు సీఐ ఆనందరావు, స్థానిక వైద్య అధికారులు ఓబులవారిపల్లిలో ఉన్న కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ప్రతి వ్యక్తి భౌతిక దూరం పాటించాలన్నారు.
ఓబులవారిపల్లె మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రజలు ఎవరైనా సరే.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఎవరైనా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు ఉంటే తమకు తెలపాలని కోరారు. అధికారులకు తెలియకుండా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఎవరూ వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వెళ్తే.. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
కరోనా పరీక్షల్లో ఆ యువకునికి.. నో పాజిటివ్... నో నెగిటివ్!