పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మార్కండేయపురం పరిధిలో సర్వే నంబర్ 56/1,56/2లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కోనుగోలు చేసింది. భూములు విక్రయించిన రైతులు తోట రామారావు, బలపర్తి దుర్గారావులకు ప్రభుత్వధర కంటే అధికంగా పరిహారం ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి వారికి ఎకరాకు రూ.44.53 లక్షలు ఇప్పిస్తామంటూ... మెుత్తం 8 ఎకరాలకు 20 లక్షలు ఇచ్చేలా ఇద్దరు దళారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయిన తక్షణమే తమ ఖాతాల్లోకి చెరో ఐదు లక్షలు వేయించుకున్నారు.
ఇద్దరు రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసే స్థలాల్లో ఆరు ఇళ్ల పట్టాలు ఇవ్వటంతో పాటు సమీపంలో ఉన్న వారి నివాస గృహాలను తొలగించకూడదని దళారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లేఅవుట్ నిర్మాణాల్లో భాగంగా ఇటీవల రెవెన్యూ అధికారులు రైతులు నివాసముంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడంతో అసలు బాగోతం బయటపడింది. దళారులు తమను మోసం చేసారని న్యాయం చేయాలంటూ బాధిత రైతులు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వద్ద మొర పెట్టుకున్నారు. మోసపోయిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.