విజయనగరం పూసపాటి రాజులకు బొబ్బిలి రాజవంశీయులకు ఉన్న చారిత్రక వైరం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లోనూ.. ఈ రాజవంశీకులది ప్రత్యేక ముద్ర. బొబ్బిలి వంశీయుడైన రాజా శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు మద్రాసు రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన వారసులు రాజకీయాల్లో కొనసాగారు. . ప్రస్తుత తరంలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇక పూసపాటి వంశంలోనూ.. చాలా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి తండ్రి.. విజయనగర సంస్థానం చిట్టచివరి రాజు అయిన పీవీజీ రాజు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అశోక గజపతి సోదరుడు ఆనందగజపతి కూడా ఎంపీగా ..మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతి ఏడుసార్లు ఎమ్మెల్యేగా .. ఒకసారి ఎంపీగా గెలిచి.. రాష్ట్రం, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. అయితే ఈ రెండు రాజవంశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం రాజకీయాల్లోనూ కొనసాగుతూ వచ్చింది. బొబ్బిలి రాజవంశీకులు జస్టిస్ పార్టీలో ఉన్న సమయానికి పూసపాటి రాజు.. సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్ లోనూ ఉన్నారు. ముప్పై ఏడేైళ్ల నుంచి పూసపాటి కుటుంబీకులు తెదేపాలో ఉండగా.. బొబ్బిలి రాజులు కాంగ్రెస్ లోనూ.. ఆ తర్వాత వైకాపాలోనూ ఉన్నారు. రెండేళ్ల కిందట సుజయకృష్ణ తెదేపాలోకి వచ్చారు. అశోక్ గజపతికి.. బొబ్బిలి రాజులకు మధ్య చంద్రబాబు సర్దుబాటు చేశారు. తరాలుు మారుతుండటంతో కుటంబాల మధ్య ఉన్న వైరం కూడా చాలా వరకూ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా ఒకేపార్టీకి రావడంతో రాజకీయ వైరానికి కూడా ముగింపు పలికినట్లైంది.
వైరిచర్ల X శత్రుచర్ల....
ఇదే జిల్లాలోని మరో రెండు సంస్థానాల మధ్య ఏళ్ల నాటి వైరం ఉంది. కురుపాం సంస్థానాన్ని పాలించిన వైరిచర్ల రాజకుటుంబానికి ఆ పక్కనే ఉన్న మేరంగి సంస్థానానికి చెందిన శత్రుచర్ల కుటుంబాలకు మధ్య ఎప్పటి నుంచో శతృత్వం ఉంది. ప్రస్తుతం కురుపాం నుంచి కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ , మేరంగి నుంచి రాష్ట్ర మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ అనివార్యతల కారణంగా ఇరువురూ ఒకే పార్టీలో ఉన్నా.. వీరి మధ్య మాత్రం సఖ్యత లేదు. కిషోర్ చంద్రదేవ్ ఎక్కువుగా జాతీయ రాజకీయాలకే పరిమితం కావడంతో రాజకీయ పోరు తీవ్ర రూపం దాల్చలేదు. అయితే వారిమధ్య దూరం అలాగే కొనసాగుతూ ఉంది. కిందటి ఎన్నికలకు ముందు శత్రుచర్ల కుటుంబం కాంగ్రెస్ ను వీడి తెదేపాలోకి వెళ్లింది. అయితే 2014 ఎన్నికల్లో శత్రుచర్ల తెదేపాలో ...వైరిచర్ల కాంగ్రెస్లో ఉండటంతో సమస్య రాలేదు. తాజాగా కిశోర్ చంద్రదేవ్...తెదేపాలోకి వచ్చేశారు. ఆయన అరకు నుంచి పార్లమెంటుకు పోటీ చేేస్తున్నారు. శత్రుచర్ల, వైరిచర్ల కలిసి పనిచేస్తే...అరకు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు.. మెజార్టీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవచ్చన్నది తెదేపా వ్యూహం. వీరిరువురూ.. పూర్తిగా కలిసి పనిచేసే పరిస్థితి లేనప్పటికీ.. ఒకప్పటి వైరం మాత్రం లేదు. ప్రస్తుతానికి రెండు వర్గాల వారు తటస్థంగా ఉన్నారు.
రాజులంతా ఒకచోటే..
కొన్ని సంవత్సరాలు.. పూసపాటి మినహా.. మిగిలిన మూడు సంస్థానాల వారు .. కాంగ్రెస్ లో ఉన్నారు. అయితే నాలుగు రాజకుటుంబాలు ఒకే చోటకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. ఇది రాజకీయంగా తమకు మేలు చేస్తుందని తెదేపా భావిస్తోంది. 2014 జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లను తెదేపా కైవసం చేసుకోగా...మరో 3 స్థానాలు వైకాపా ఖాతాలోకి వెళ్లాయి. రాచకుటుంబాల రాకతో రాజకీయం తమకు అనుకూలంగా మారుతుందని తెదేపా ఆశిస్తోంది.