దివంగత పీవీజీ రాజు మానసపుత్రికలు మాన్సస్ సంస్థలోని విద్యాలయాలను ఎవరు ముట్టుకోకూడదని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మ అన్నారు. ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంపై గురజాడ పబ్లిక్ పాఠశాలలో లోక్ సత్తా పార్టీ ఆధ్యక్షతన నిర్వహించిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సమావేశానికి ముఖ్యఅతిథిగా రఘు వర్మ హాజరయ్యారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రం పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న మహారాజా కళాశాలను ప్రభుత్వమే నడపాలి లేదా యథావిథిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు.
మాన్సస్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం సంచిత, అశోకగజపతి, ఊర్మిలా సమస్య కాదు. నాలుగు వేల మంది విద్యార్థులతో పాటు జిల్లా ప్రజల సమస్య. పూర్వపు విద్యార్థులు, ఎంఆర్ కాలేజీపై ఆభిమానం ఉన్నవారు ప్రస్తుత పరిణామాలపై గొంతు విప్పకపోతే ప్రమాదమని తప్పదు. -భీశెట్టి బాబ్జి, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు.
ఎమ్మార్ కాలేజీలో పూర్వ విద్యార్థిని. మాన్సస్ సంస్థలో జరుగుతున్న గందరగోళం చూసి దేశ విదేశాల్లోని తన స్నేహితులు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. అసలు మాన్సస్లో ఏం జరుగుతుందో ?. ప్రభుత్వం ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలి. వాస్తవాలు తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. -డాక్టర్ ఎమ్.వెంకటేశ్వరరావు, ఫోరమ్ ఫర్ బెటర్ విజయనగరం అధ్యక్షుడు
ఇటువంటి నిర్ణయం వలన బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. ఎంఆర్ కాలేజీ ప్రైవేటు పరం చేస్తే సామాన్యులకు జిల్లాలో చదువు అందదు. మేధావులు, విద్యార్థులు ఈ ఆంశంపై అలోచన చేయాలి. పెద్దఎత్తున ప్రజా ఆందోళనలు చేపట్టకపోతే ప్రభుత్వం వెనక్కి తగ్గదు. -గుల్లిపల్లి జయపాల్,ఎమ్మార్ కాలేజీ ఉపాధ్యాయులు
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ, జనసేన జిల్లా నాయకులు త్యాడ రామకృష్ణ, ఆమాద్మీ నాయకుడు కోటేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఆర్.కృష్ణాజి, వివిధ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: