Pawan Kalyan Distributes Cheques to Fishermen: మరో 4 నెలల తర్వాత మీకు మంచి రోజులు వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన జనసేనాని.. వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు 49 మందికి చెక్కులు ఇచ్చిన పవన్.. తమ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బోట్లు కాలిపోవడం వల్ల రూ. 25 కోట్ల నష్టం జరిగిందని.. మత్స్యకారులు బాగా నష్టపోయారని అన్నారు. బోటు యజమానులకు పరిహారం సరిగా అందడం లేదని విమర్శించారు. బోటు విలువలో 80 శాతం ఇస్తామన్న ప్రభుత్వం.. ఇచ్చిందా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్.. తనకు మద్దతుగా నిలవాలని.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాదం దురదృష్టకరం - బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
మన రాష్ట్రంలో ఒక్క జెట్టీ కూడా సరిగా లేదని.. మన ప్రభుత్వం వచ్చాక గుజరాత్‌లా ఇక్కడా జెట్టీలు కట్టుకుందామని చెప్పారు. జగన్‌కు ప్రస్తుతం ఉన్న ఇళ్లు సరిపోవా అని మండిపడ్డ పవన్.. ఇప్పుడు రుషికొండలో మరో ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రుషికొండలో ఖర్చు చేసిన డబ్బుతో మరో ఫిషింగ్ హార్బర్ కట్టవచ్చని విమర్శించారు.
పార్టీ నుంచి కానీ, వ్యక్తిగతంగా కానీ తాను సహాయం చేస్తే.. ఆ డబ్బు వారి కష్టాలను పూర్తి స్థాయిలో తీర్చకపోయినా సరే.. ఎల్లప్పుడూ తాను, జనసేన పార్టీ, నాయకులు తోడుగా ఉంటారు అని చెప్పేందుకే సహాయం చేస్తున్నానని అన్నారు. అదే విధంగా కొంతమంది హార్బర్లో గ్యాంగ్‌లుగా ఏర్పడి భయపెడుతున్నారని పవన్ ఆరోపించారు. మహిళలను బెదిరించి దోచుకుంటున్నారని అన్నారు. ఇది ఇంతకు ముందు లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీలు ఎక్కువయ్యారని మండిపడ్డారు.
ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం - మత్స్యకార్మికులను ఆదుకోవాలన్న లోకేశ్
తమ ప్రభుత్వం వచ్చిన జెట్టీని ఆధునికీకరణ చేస్తామని తెలిపారు. హార్బర్‌ని సైతం బాగు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ వచ్చిన నాలుగేళ్లలో ఎన్ని హార్బర్లను ఆధునికీకరించారని ప్రశ్నించారు. తాను ఈ రోజు విశాఖ రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించారని.. తాము బుక్ చేసుకున్న ఫ్లైట్‌ని సైతం బెదిరించి పంపించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్సలు తాను అంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్న పవన్.. నిజంగా పథకాలు అన్నీ సక్రమంగా ప్రజలకు ఇస్తే భయపడాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. అదే విధంగా మత్స్యకారులకు రావాల్సిన పరిహారం పూర్తి స్థాయిలో అందడం లేదని.. కొంత సొమ్ము వారికిి అందలేదని.. అది ఎవరికి వెళ్లిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని.. వైసీపీని తరిమేద్దామని పిలుపునిచ్చారు.
అగ్నిప్రమాదంతో రోడ్డునపడ్డ వందలాది కుటుంబాలు - న్యాయం చేయాలంటూ బోరున విలపిస్తున్న బాధితులు