Drug trafficking gangs: ఔషధ దుకాణాల ద్వారా మత్తు పదార్ధాలను విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసింది నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు. మత్తు పదార్ధాలు విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుల నుంచి సుమారు రూ.40 లక్షల విలువ చేసే ఆల్ఫోజోలం 15.2 కిలోలు, 1160 సీసాల కోడైన్ ఫాస్పేట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భారీఎత్తున మత్తు పదార్థాలు స్వాధీనం..: ఏళ్ల తరబడి యధేచ్ఛగా సాగుతున్న దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మలక్‌పేట్, కుల్సంపుర పోలీసులతో సంయుక్తంగా నగరవ్యాప్తంగా పలు మందుల దుకాణాలపై జరిపిన దాడుల్లో భారీఎత్తున మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
దక్షిణ ఢిల్లీ ఫరిదాబాద్ నుంచి సరఫరా..: పోలీసుల కథనం ప్రకారం దక్షిణ ఢిల్లీ ఫరిదాబాద్‌కు చెందిన పవన్ అగర్వాల్ కొడిన్ ఫాస్పెట్ దగ్గు మందు సరఫరా ప్రధాన డీలర్. అక్కడ నుంచి గుజరాత్, ముంబయి, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో బయోస్పేర్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు మహ్మద్ బషీర్ అహ్మద్‌కు ఒక్కో కొడిన్ ఫాస్పెట్ సీసా రూ.40 లకు విక్రయిస్తున్నాడు. వీటిని ఎటువంటి రశీదులు లేకుండా అక్రమంగా సైదాబాద్‌లోని సత్యనారాయణ, వేణులకు చేరవేస్తున్నారని పోలీసులు వివరించారు.
మత్తుపదార్థాల వ్యసనపరులే కొనుగోలుదారులు..: మత్తుపదార్థాల వ్యసనపరులకు నల్లబజారులో ఒక్కసీసా రూ.200లకు విక్రయించి భారీ లాభాలు సంపాదిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలోని వందలాది మందుల దుకాణాలు వీటిని మందులు చీటి లేకుండా యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొడిన్ ఫాస్పెట్ దగ్గు మందులో నల్లమందు వాడకం అధికంగా ఉండటంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. కేవలం వైద్యుల సిఫార్సుతో మాత్రమే వాడేందుకు అనుమతినిచ్చింది. కొన్ని పార్మా కంపెనీలు మాత్రమే అనుమతులతో తయారీ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా భారీఎత్తున ఈ మందు తయారు చేస్తూ అడ్డదారిలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు, బస్సుల ద్వారా చేరవేస్తున్నారు.
మానసిక సమస్యలకు వైద్యుల సిఫార్సు లేకుండానే..: మానసిక సమస్యలకు వైద్యుల సిఫార్సుతో వాడాల్సిన అల్ఫాజోలం ఒక్కో మాత్ర మార్కెట్లో 20-30 పైసలు ఉంటుంది. మత్తులో ముంచెత్తే ఈ అల్ఫాజోలం మాత్రలను నగరంలోని పలు మందుల దుకాణాలు ఒక్కో మాత్ర 12 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి.
ప్రధాన నిందితుడు అద్దంకి వెంకట సురేష్ ..: ఈ అక్రమదందాలో ప్రధాన నిందితుడు అద్దంకి వెంకట సురేష్. ఇతడు కాచిగూడలో గణేశ్ పార్మాస్యూటికల్స్ నిర్వహిస్తున్నాడు. రాజస్తాన్‌లోని బయో ల్యాబ్ రెమిడీస్, కవాడిగూడలోని అజంతా మెడికల్ ఏజెన్సీల నుంచి ఎటువంటి రశీదులు లేకుండా భారీఎత్తున అల్పాజోలం మాత్రలను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తాడు. వాటిని పూర్ణచందర్, మల్లేష్, రమేష్ వేణుగోపాల్ వంటి ప్రయివేటు వ్యక్తుల ద్వారా నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్ పేట్, ఆసిఫ్ నగర్ తదితర ప్రాంతాల్లోని 12-15 మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
అల్ఫాజోలం మాత్రల విక్రయాలపై నిషేధం..: అల్ఫాజోలం మాత్రలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మెడికల్ షాప్ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి, కె.వేణుగోపాల్, శ్రీధర్, పవన్, మహ్మద్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అబ్దుల్, జహీరుద్దీన్ అహ్మద్, వీరణ్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు ముఠాల నుంచి 1160 కోడిన్ ఫాస్ఫేట్ సీసాలు, 15.2 కిలోల అల్ఫాజోలం (152,000 మాత్రలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నార్కోటిక్ విభాగం డీసీపీ గుమ్మి చక్రవర్తి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దుకాణాల లైసెన్స్ ల అనుమతి రద్దుకు సిఫార్సు..: త్వరలో నిషేధిత మత్తుపదార్థాలు, నిబంధనలకు విరుద్ధంగా దగ్గుమందు, మాత్రలను విక్రయిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అంబర్‌పేట డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా 15 మందుల దుకాణాల లైసెన్స్‌లను అనుమతి రద్దు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో సుమారు 25,000 మందుల దుకాణాలున్నాయి. వీటిలో అధికశాతం డబ్బుపై ఆశతో కడుపునొప్పి, మానసిక సమస్యలు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు ఉపయోగించే మాత్రలను 100-150 రెట్ల ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఉన్నతాధికారులు సిఫార్సు మేరకు వీటిపై చర్యలు తీసుకోనున్నట్టు డ్రగ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి