Nara Lokesh meets youth: అధికారంలోకి వచ్చాక ఏటా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు పరీక్షల నుంచి నియామక పత్రాల జారీ వరకు స్పష్టమైన తేదీలను ప్రకటించి అమలు చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 21వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో పరిశ్రమలు లేక ఉపాధి కోసం వలసలు వెళ్తున్నామని యువత లోకేశ్‌కు వివరించారు. జాబ్ క్యాలెండర్ అంటే మోసపోయి ఓటేసామని.. జగన్ తమని నమ్మించి మోసం చేశారని తెలిపారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగప్రదేశ్గా మారిపోయిందని లోకేశ్ అన్నారు. రాయలసీమను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేశామన్నారు. టీడీపీ పాలనలో 6 లక్షల ఉద్యోగాలిచ్చామని వైసీపీ ప్రభుత్వమే మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిందని గుర్తు చేశారు.
రైతులతో లోకేశ్: ఉద్యాన రైతులతో లోకేశ్ రాజుల కండ్రిగలో ఉద్యాన రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు రుణాలు, సబ్సిడీపై ట్రాక్టర్లు, బిందుసేద్య పరికరాలు లేవని విమర్శించారు. శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, భూసార పరీక్ష నిర్వహిస్తామని జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కరెంటు బిల్లు ఒక్కరోజు లేటుగా కడితే కనెక్షన్ తీసివేస్తున్నారని... వ్యవసాయరంగం పైనే కాదు ఏ రంగంపైనా జగన్ రెడ్డికి అనుభవం లేదని.. కేవలం దోచుకోవడంపైనే అవగాహన ఉందని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందు ధరలు, కూలీ ఖర్చులు పెరిగాయి కానీ రైతుల ఆదాయం తగ్గిందన్నారు. ఒక్క ఛాన్స్ జగన్‌కు ఇచ్చి పాలిచ్చే ఆవును కాదనుకుని.. ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చకున్నారని తెలిపారు. రైతుల సమస్యలు పోవాలంటే 'సైకో పోవాలి సైకిల్ రావాలని' పిలుపునిచ్చారు.
పోలీసుల తీరుపై లోకేశ్: లోకేశ్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో జెండాలు, బ్యానర్లను పోలీసులు తొలగించిన తీరుపై లోకేశ్ స్పందించారు. కేవీబీ పురంలో స్ధానికుల ముఖాముఖిలో భాగంగా పోలీసుల తీరుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. తన సౌండ్ వెహికల్, మైకు, స్టూలు పోలీసులు లాకున్నారని ఆరోపించారు. అడుగడుగునా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజల కొసం పోరాడేందుకు వచ్చానన్నారు. 21 రోజుల యువగళం పాదయాత్ర ట్రైలర్‌కే భయపడుతున్న జగన్‌కు 379 రోజుల దండయాత్ర ముందు ఉందన్నారు.
ఎన్నికల నియమావళిపై: లోకేశ్ యువగళం పాదయాత్రపై మరోసారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సత్యవేడు నియోజకవర్గం తిమ్మ సముద్రం, రాగి కుంట, కొత్తూరు, పివి కండ్రిగ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లను ఎన్నికల నియమావళి పేరుతో పొలీసులు తొలగించారు. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవంటూ జెండాలు, బ్యానర్లు ఎలా తొలగిస్తారంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.
ఇవీ చదవండి: